డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై విచారణ జరిపించాలి - కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కేంద్రం విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. రెజర్లు మన దేశానికి గర్వకారణమని అన్నారు. వారు మన దేశానికి ఖ్యాతి తీసుకొచ్చారని తెలిపారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక దోపిడీ, మానసిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా గురువారం డిమాండ్ చేశారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
డబ్ల్యూఎఫ్‌ఐ, దాని అధ్యక్షుడిపై రెజ్లర్లు తీవ్ర ఆరోపణలు చేశారని ప్రియాంక గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. రెజ్లర్లు భారతదేశానికి గర్వకారణం అని, వీరు ప్రపంచవ్యాప్తంగా దేశానికి ఖ్యాతిని తీసుకువచ్చారని ఆమె అన్నారు. వారి మాటలు వినాలని సూచించారు.
నాకే రక్షణ లేనప్పుడు సాధారణ మహిళ పరిస్థితి ఏంటీ?: ఓ కారు డ్రైవర్ తనను ఈడ్చుకెళ్లాడన్న స్వాతి మలివాల్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దాని చీఫ్ తీరును నిరసిస్తూ టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత వినేష్ ఫోగట్ నేతృత్వంలోని దాదాపు 30 మంది రెజ్లర్ల బృందం న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో బుధవారం నుంచి ఆందోళన చేపడుతున్నారు.
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా భూషణ్ శరణ్ సింగ్ ను తొలగించాలని ఈ సందర్భంగా రెజర్లు డిమాండ్ చేశారు. తమపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను శరణ్ సింగ్ ఖండించారు. పాలక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి పార్లమెంటు సభ్యుడైన సింగ్.. తనను తొలగించే కుట్రలోనే ఈ నిరసనలు భాగమని అన్నారు.
అయితే రెజర్లు చేపడుతున్న ఈ నిరసనలపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ కూడా స్పందించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న బీజేపీ నేతల జాబితాకు అంతులేదని ఆరోపించారు. ‘‘బీజేపీ నేతల నుంచి కూతుళ్లను కాపాడేందుకు ‘బేటీ బచావో’ హెచ్చరికలా? భారతదేశం సమాధానం కోసం ఎదురుచూస్తోంది...’’ అని ఆయన ప్రశ్నించారు.
‘‘ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. మహిళలను అణిచివేసే వారందరూ ఎందుకు బీజేపీలోనే సభ్యులుగా ఉన్నారు. ? గత 8 ఏళ్లలో క్రీడలకు మెరుగైన వాతావరణం కల్పించామని నిన్న మీరు చెప్పారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే మన ఆడబిడ్డలకు కూడా భద్రత లేని 'మంచి వాతావరణం' ఇదేనా?’’ అని బుధవారం ఓ క్రీడా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రమేశ్ అన్నారు. కాగా.. భూషణ్ శరణ్ సింగ్ వచ్చిన ఆరోపణలపై 72 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ డబ్ల్యూఎఫ్‌ఐని వివరణ కోరింది.