పశ్చిమ బెంగాల్‌లో ఓ నవజాత శిశువు సజీవంగా ఉండగానే వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. అది నిజమేనని నమ్మి తల్లిదండ్రులు శిశువుకు అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు బేబీలో కదలికలు కనిపించడంతో హాస్పిటల్ తీసుకెళ్లారు. కొద్ది సేపటికే శిశువు మరణించింది.
కోల్‌కతా: నవజాత శిశువుకు ఆ ప్రభుత్వ హాస్పిటల్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది. అది నిజమే అని నమ్మిన కుటుంబం శిశువును ఖననం చేయడానికి సిద్ధమైంది. అంత్యక్రియలు చేస్తుండగా ఆమె కదులుతూ.. శ్వాస తీస్తూ కనిపించింది. దీంతో వెంటనే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, ఆ తర్వాత పాప మరణించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వెస్ట్ మిడ్నాపూర్‌లోని ఘాతల్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ నవజాత శిశువు నెలలు నిండకముందే జన్మించింది. బలహీనంగా జన్మించింది. ఆ నవజాత శిశువు జన్మించిన రెండు రోజులకే హాస్పిటల్ సిబ్బంది తల్లిదండ్రుల చేతిలో డెత్ సర్టిఫికేట్ పెట్టారు.
దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శిశువకు అంత్యక్రియలు జరపడానికి తీసుకెళ్లారు. కానీ, శిశువులో కదలికలు పసిగట్టగానే పరుగున హాస్పిటల్ తీసుకువచ్చారు. అనంతరం, కొద్ది సేపటికే శిశువు మరణించింది.
తమ బేబీని హత్య చేశారని శిశువు తండ్రి అన్నాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించిందని ఆరోపించాడు. ఈ శిశువు నెలల నిండకముందే జన్మించిందని వైద్యులు చెప్పారని అన్నాడు. అందుకే నియోనాటల్ యూనిట్‌లో ఇంక్యుబేషన్‌లో నవజాత శిశువును ఉంచినట్టు వివరించాడు.
ఏప్రిల్ 7వ తేదీన జన్మిస్తే 8వ తేదీన సాయంత్రం 5 గంటలకు మరణించినట్టు వైద్యులు డిక్లేర్ చేశారని అన్నాడు. బ్రతికి ఉండగానే మరణించినట్టు వైద్యులు ఎలా డిక్లేర్ చేశారని ఆ కుటుంబం హాస్పిటల్ ముందు ధర్నా చేసింది.
ఆ బేబీ ఆరు నెలలు కూడా నిండకముందే జన్మించిందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. 440 గ్రాముల బరువు మాత్రమే ఉన్నదని వివరించాయి. రికవరీ అవుతున్న సంకేతాలేవీ ఆ బేబీ నుంచి రాలేవని, అందుకే వైద్యులు ముందుగానే డెత్ సర్టిఫికేట్ రిలీజ్ చేసినట్టు పేర్కొన్నాయి. ఆ నవజాత శిశువు కండీషన్ వేగంగా క్షీణించిపోయిందని అన్నాయి.
ఈ గందరగోళం నడుమ ఘటనపై దర్యాప్తు జరపడానికి ఓ కమిటీ వేసినట్టు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. బాధ్యులపై శాఖాపరమైన చర్యలూ తీసుకుంటామని, అలాంటి నిర్లక్ష్యాన్ని తాము సహించబోమని జిల్లా చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య శంకర్ సరేంగి తెలిపారు.
