పశ్చిమ బెంగాల్‌లో పార్టీ మధ్య వైరం తీవ్రంగా ఉన్నది. ఈ వైరం ఆ పార్టీ మధ్య కార్యకర్తలకూ పాకుతున్నది. తృణమూల్ పార్టీకి మద్దతు ఇస్తున్నాడని కొడుకు ఇంటిపై తండ్రి బాంబ్ వేశాడు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని అనుకున్నాడని కొడుకు ఆరోపించాడు. తండ్రిపై కేసు ఫైల్ అయింది. 

కోల్‌కతా: ఒక భావజాలాన్ని, ఒక ఆలోచనా విధానాన్ని కలిగి ఉండటంలో తప్పులేదు. ఒక పార్టీని అభిమానించడంలోనూ తప్పులేదు. కానీ, ఆ పార్టీలకు తమ జీవితాల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడమే సమస్యగా మారుతున్నది. ఇది క్రమంగా కుటుంబాలను ధ్వంసం చేసే వరకూ వెళ్లుతున్నది. పార్టీల మధ్య ఉండే విభేదాలు కుటుంబాల మధ్య శత్రుత్వాలుగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తండ్రీ కొడుకుల మధ్య బాంబులు వేసుకునే దాకా పరిస్థితులు వెళ్లాయి. తృణమూల్ పార్టీకి మద్దతు ఇస్తున్నాడని కొడుకు కుటుంబంపై కాంగ్రెస్ వర్కర్‌గా ఉన్న తండ్రి బాంబు వేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. బాంబు వేసినట్టుగా అనుమానిస్తున్న తండ్రిపై కేసు నమోదైంది. ఈ ఘటన ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

జహీరుద్దీన్ షేక్ (62), అనిసుర్ షేక్ (30) తండ్రీ కొడుకులు. అనిసుర్ షేక్‌కు పెళ్లయింది. రాణినగర్ 2 పంచాయత్ ఏరియాలో అనిసుర్ షేక్ టీఎంసీ యూత్ ప్రెసిడెంట్. జహీరుద్దీన్ షేక్ కాంగ్రెస్ వర్కర్. 2018 పంచాయతీ ఎన్నికల నుంచి వీరిమధ్య వైరం మొదలైంది. ఈ ఎన్నికల్లో అనిసుర్ షేక్ భార్య షెఫాలీ షేక్ టీఎంసీలో చేరింది. ఆమెను టీఎంసీ పంచాయతీ ప్రదాన్‌గా చేసింది. ఆ తర్వాత కొడుకు, కోడలు వేరుగా జీవిస్తున్నారని స్థానికులు చెప్పారు.

ఆదివారం రాత్రి కొడుకు అనిసుర్ షేక్ ఇంటిపై తండ్రి జహీరుద్దీన్ షేక్ బాంబు వేసినట్టు కేసు నమోదైంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేవని పోలీసులు తెలిపారు. అనిసుర్, షెఫాలీలు ఆ దాడి నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగారు. కానీ, ఆ ఏరియాలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.

Also Read: భారత్-చైనా సంబంధాలు: భార‌తీయ సంస్కృతి వెల్లివిరిసిన ఖోటాన్ రాజ్యం !

వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను అడ్డుకోవడానికే తండ్రి తన ఇంటిపై బాంబు వేశాడని అనిసుర్ ఆరోపించాడు. కాగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్ కొట్టి వేసింది. హింస అనేది టీఎంసీ హాల్ మార్క్ అని విమర్శించింది. తనపై కోడలు తప్పుడు నేరారోపణలు చేస్తున్నదని జహీరుద్దీన్ షేక్ ఖండించారు. అనిసుర్ స్వయంగా తానే తన ఇంటిపై బాంబు వేసుకున్నాడని, తద్వార సానుభూతి పొందాలని అనుకున్నాడని ఆరోపించారు.

అనిసుర్ షేక్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు జహీరుద్దీన్ షేక్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏరియాలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఓ పోలీసు బృందం మోహరించి ఉన్నది.