అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ గవర్నర్, అధికార టీఎంసీ మధ్య యుద్ధం తార స్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలో గవర్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. శాసనసభను సందర్శించేందుకు గాను ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ గురువారం అసెంబ్లీ వద్దకు రాగా.. గేటుకు తాళం వేసి ఉంది.

దీంతో మీడియా, అధికారుల కోసం ఏర్పాటు చేసిన మరో గేట్ నుంచి ఆయన లోపలికి వెళ్లాల్సి వచ్చింది. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గవర్నర్... ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనా మండిపడ్డారు.

Also Read:ఎంఐఎంపై మమత వ్యాఖ్యలు: మా బలాన్ని ఒప్పుకున్నారంటూ అసదుద్దీన్ కౌంటర్

గత మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు గవర్నర్ నుంచి ఆమోదం లభించలేదు. దీంతో స్పీకర్ సభను డిసెంబర్ 5 వరకు వాయిదా వేశారు. ఈ క్రమలో తాను గురువారం అసెంబ్లీని సందర్శించి.. అక్కడి సౌకర్యాలను పరిశీలిస్తానని గవర్నర్ జగదీప్ స్పీకర్‌కు లేఖ రాశారు.

ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ రాకపోకల కోసం శాసనసభలోని గేటు నెంబర్ 3ని కేటాయించారు. చెప్పిన ప్రకారమే గవర్నర్ జగదీప్ గురువారం అసెంబ్లీ వద్దకు రాగా.. మూడో నెంబర్ గేటుకు తాళం వేసి కనిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన గేటు ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మమత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Also Read:బెంగాల్‌లో ఒక్క చొరబాటుదారుడిని కూడా ఉండనివ్వం: అమిత్ షా

తాను అసెంబ్లీకి వస్తున్నట్లు ముందే చెప్పినా గేటుకు ఎందుకు తాళం వేశారని గవర్నర్ ప్రశ్నించారు. సమావేశాలు జరగడం లేదంటే దానర్ధం అసెంబ్లీని మూసివేయడం కాదని... ఇది భారత ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని జగదీప్ విమర్శించారు.