దేశ వ్యాప్తంగా త్వరలోనే జాతీయ పౌరసత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మంగళవారం బెంగాల్‌లో పర్యటించిన ఆయన కోల్‌కతాలో జరిగిన దుర్గాపూజలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం ఎన్నార్సీపై జరిగిన సెమినార్‌లో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో ఉండనివ్వమన్నారు. శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని, తృణమూల్ కాంగ్రెస్ ఎంతగా వ్యతిరేకించినా బీజేపీ ఖచ్చితంగా ఎన్నార్సీని అమలు చేసి తీరుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.

ఇదే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆయన విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను పెంచుకోవడానికే చొరబాటుదారులకు మమతా బెనర్జీ మద్ధతుగా నిలుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాలు సాధించడంలో పశ్చిమ బెంగాల్ కీలక భూమిక పాత్ర పోషించిందన్నారు. బెంగాల్‌లో బీజేపీ బయటి పార్టీ కాదని.. దేశ విభజన సమయంలో బెంగాల్ మొత్తం పాకిస్తాన్‌లో కలవాలని చూసిందని అమిత్ షా గుర్తు చేశారు.

కానీ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌ భారత్‌లోనే ఉండేలా పోరాడారన్నారు. చొరబాటుదారులు కమ్యూనిష్టులకు ఓటు వేసిన సమయంలో  మమత వారిని వ్యతిరేకించారని కానీ ఇప్పుడు వారు తృణమూల్‌కు మద్ధతు తెలపడంతో వారికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడటం లేదని షా మండిపడ్డారు.