Kolkata: అడెనో వైరస్ భయాందోళనల మధ్య శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా కోల్ కతాలో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బెంగాల్ లో ఊహించని విధంగా వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగాయనీ, అయితే పరిస్థితి అదుపులో ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
West Bengal-Adenovirus scare: పశ్చిమ బెంగాల్ లో గత 24 గంటల్లో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. అడెనో వైరస్ భయాందోళనల మధ్య ఈ మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రధానంగా రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని వివిధ ఆసుపత్రుల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే ఇది అడెనోవైరస్ వల్ల జరిగిందో? లేదో వైద్యులకు ఖచ్చితంగా తెలియదని ఆరోగ్య శాఖ అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
ఐదుగురు పిల్లల్లో ఇద్దరు కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, మరో ముగ్గురు డాక్టర్ బీసీ రాయ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. "న్యుమోనియాతో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. అడినోవైరస్ కారణంగా మరణించిందా లేదా అని నిర్ధారించడానికి తొమ్మిది నెలల చిన్నారికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్ కోసం మేము ఇంకా వేచి ఉన్నాము" అని ఆరోగ్య అధికారి తెలిపినట్టు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా కోల్‌కతా లోన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇద్దరు శిశువులు మరణించారని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. పొరుగున ఉన్న హుగ్లీ జిల్లా చందర్‌నాగోర్‌కు చెందిన తొమ్మిది నెలల చిన్నారి కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో, మరో చిన్నారి డాక్టర్ బీసీ రాయ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్ సైన్సెస్ లో మృతి చెందింది. సోమవారం రెండు మరణాలు నమోదయ్యాయనీ, పొరుగు ప్రాంతాల్లోని ఆసుపత్రుల నుంచి కేసులు పంపినట్లు అధికారులు తెలిపారు. శనివారం నాడు రాష్ట్రంలో మూడు మరణాలు నమోదయ్యాయి, వీటిలో ఒకటి అడినోవైరస్ సంక్రమణ వల్ల సంభవించిందని సమాచారం.
బెంగాల్ లో అడెనోవైరస్ కేసులు అనూహ్యంగా పెరిగాయనీ, అయితే పరిస్థితి అదుపులో ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య యంత్రాంగం పేర్కొంది. ఈ ఏడాది జనవరి వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ కు ఇచ్చిన మొత్తం నమూనాల్లో సుమారు 32 శాతం మందికి వైరస్ సోకినట్లు తేలిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పీటీఐ నివేదిక ప్రకారం, ఈ కేసులలో ఎక్కువ భాగం కోల్‌కతాలో సంభవించాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా అడెనోవైరస్ కేసుల పెరుగుదల గతంలో గుర్తించబడలేదని పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సిద్ధార్థ్ నియోగి చెప్పారు. కానీ, ఈ ఏడాది కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గడం, ప్రజలు పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించడంతో అడినోవైరస్ కేసులు పెరిగాయన్నారు.
అడెనోవైరస్ లు ఫ్లూ లాంటి వ్యాధి, జలుబు, కండ్లకలక, న్యుమోనియా, బ్రోన్కైటిస్ లేదా క్రూప్ వంటి శ్వాసకోశ అనారోగ్యాలకు కారణమయ్యే వైరస్ ఒక రూపం. ఇది ఎగువ వాయుమార్గ సంక్రమణకు కారణమై శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుజేస్తూ అనారోగ్యానికి కారణం అవుతుంది. అడెనోవైరస్ లు సాధారణంగా పిల్లల శ్వాసకోశ లేదా జీర్ణవ్యవస్థలలో అంటువ్యాధులకు కారణమవుతాయి. అడెనోవైరస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు శీతాకాలం చివరిలో, వసంతకాలంలో- వేసవి ప్రారంభంలో సర్వసాధారణం, కానీ అవి సంవత్సరంలో ఏ సమయంలోనైనా సంభవించవచ్చుననీ నివేదికలు పేర్కొంటున్నాయి. చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్ఫియా ప్రకారం, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి.
