ఐఫోన్ కొనడానికి కన్న బిడ్డను అమ్ముకున్నారు.. ఆ ఫోన్ ఎందుకో తెలిస్తే షాకవుతారు!
పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు తమ ఎనిమిదేళ్ల పాపను అమ్మేశారు. పాపను అమ్మగా వచ్చిన డబ్బులతో ఐఫోన్ 14 కొనుగోలు చేశారు. తాము పర్యటిస్తున్నప్పుడు షూట్ చేసి రీల్స్ చేయడానికే ఐఫోన్ 14 కొనుగోలు చేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కోల్‌కతా: ఐఫోన్ కొనుగోలు చేయడం గురించి సోషల్ మీడియాలో ఓ మీమ్ తరుచూ వైరల్ అవుతూ ఉంటుంది. ఐఫోన్ కావాలంటే.. ఓ కిడ్నీ అమ్ముకుంటే సరిపోతుందనేది ఆ మీమ్ చెబుతుంది. ఐఫోన్ ధర అంత ఎక్కువ అని చెప్పడమే అందులో సారాంశం. అయితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు ఐఫోన్ కోసం కిడ్నీ కాదు.. ఏకంగా కన్న బిడ్డనే అమ్ముకున్నారు. మరింత షాకింగ్‌గా అనిపించేదేమంటే.. పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తూ రీల్స్ షూట్ చేయడానికే ఐఫోన్ 14 కొనాలని నిర్ణయించుకున్నారు.
ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన దంపతులు 8 ఏళ్ల చిన్నారిని ఐఫోన్ 14 కొనడానికి అమ్మేశారు. పోలీసులు ఆ చిన్నారి తల్లిని అరెస్టు చేశారు. తండ్రి జయదేశ్ ఘోష్ పరారీలో ఉన్నాడు.
ఆ బేబీ కొన్నాళ్ల నుంచి కనిపించడం లేదని స్థానికులు గమనించారు. చిన్నారి కనిపించకున్నా ఆ దంపతుల్లో ఆందోళన లేకపోవడం వారిలో అనుమానాన్ని రేపింది. అంతేకాదు, పేదరికంలో మగ్గే జయదేవ్ ఘోష్ కుటుంబం చేతిలో ఐఫోన్ 14 కనిపించడంతో వారి అనుమానాలు చాలా వరకు బలపడ్డాయి.
ఓ సారి వారి మధ్య గొడవ జరిగినప్పుడు.. ఆ మహిళే తన బిడ్డను అమ్మేసినట్టు అంగీకరించింది. గతంలోనూ తన ఏడేళ్ల కూతురిని అమ్మడానికి తన భర్త ప్రయత్నించినట్టు ఆమె చెప్పింది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.