ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారా యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని బెంగాల్ సీఎం మమత బెనర్జీ చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆమె ఇవాళ స్పందించారు.
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో BJP విజయాలపై బెంగాల్ సీఎం Mamata Banerjee సందేహం వ్యక్తం చేశారు. ఇది ప్రజల తీర్పు కాదని ఎన్నికల యంత్రాంగం, కేంద్ర బలగాల సహాయంతో సాధించిన విజయమన్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ శుక్రవారం నాడు స్పందించారు. 2024లో బీజేపీని ఓడించేందుకు Congress పై ఆధారపడి లెక్కలు వేయడం అర్ధం లేదన్నారు. కేంద్ర యంత్రాంగం, బలగాల ద్వారా బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించిందని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆరోపించారు.
EVMను తొలగించినందుకు వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ను సస్పెండ్ చేస్తే అది పెద్ద విషయమన్నారు. ఈ ఎన్నికల పలితాలపై ఎస్పీ నేత Akhilesh Yadav నిస్పృహ చెందకూడదన్నారు. ప్రజల వద్దకు వెళ్లి BJPని సవాల్ చేయాలని ఆమె సూచించారు.
బీజేపీ ప్రజల ఓట్లతో గెలవలేదు, యంత్రాల సహాయంతో గెలిచిందని ఆమె విమర్శించారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలనే పార్టీలన్నీ కలిసి కట్టుగా పనిచేయాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పై ఆధారపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పూర్తిగా ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024 లోక్ సభ ఎన్నికలపై ఫలితం చూపుతాయని వాదనలను టీఎంసీ చీఫ్ తోసిపుచ్చారు. బీజేపీ పగటి కలలు కనడం మానుకోవాలన్నారు.
