ముంబైలో పాజిటివిటీ రేటు 5 శాతానికి మించితే మరిన్ని ఆంక్షలు విధిస్తామని మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపే అన్నారు. పెరుగుతున్న కరోనా కేసులు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. అలాగే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపే స్పందించారు. రాష్ట్రంలో పెరుగుతున్న యాక్టివ్ కేసుల సంఖ్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ముంబైలో పాజిటివిటీ రేటు 4 శాతంగా ఉందని తెలిపారు. ఇది 5 శాతానికి మించితే, మరన్ని ఆంక్షలు విధించే అంశం ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. త్వరలోనే సీఎం ఉద్ధవ్ ఠాక్రే త్వరలో కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌తో సమావేశమవుతారని ఆయన తెలిపారు. “ఇప్పటి వరకు మహారాష్ట్రలో 167 ఓమిక్రాన్ కేసులు ఉన్నాయి. వీరిలో 19 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోగులలో ఎవరి పరిస్థితి విషమంగా లేదు. ప్రజా రవాణా, వివాహ వేడుకల్లో రద్దీని నియంత్రించేందుకు ఆంక్షలు విధించే నిర్ణయాన్ని ఆలోచించాలి’’ అని అన్నారు.
ఒమిక్రాన్ పేషెంట్ కు ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేదు - ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్
పిల్లల కోవిడ్-19 వ్యాక్సినేషన్‌పై దృష్టి
15-18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 3వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలని సూచించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి సారించింది. తమ ప్రభుత్వం పిల్లల కోవిడ్ -19 దృష్టి పెట్టిందని హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపె తెలిపారు. పాఠశాలల్లో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌లు వేయాలని యోచిస్తున్నామని అన్నారు.
ఒమిక్రాన్ దెబ్బ.. ఈ కంపెనీల్లో శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం !
ఇప్పటికే పలు ఆంక్షలు..
కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్రలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. ఇప్పటికే న్యూయర్ వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఉండొద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఇండోర్ వేడుకలపైనా పలు ఆంక్షలు విధించింది. జిమ్స్, స్పా, థియేటర్లు 50శాతం కెపాసిటీతో నడిపించుకోవాలని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. గుజరాత్‌లో 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్తాన్‌లో 46, కర్ణాటకలో 34, తమిళనాడులో 34, హర్యానాలో 12, పశ్చిమ బెంగాల్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 9, ఒడిశాలో 8, ఆంధ్రప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 4, చంఢీఘర్‌లో 3, జమ్మూ కశ్మీర్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, గోవాలో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లడఖ్‌లో 1, మణిపూర్‌లో 1 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కరోనాను నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ఓ వైపు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే మరో వైపు ప్రజల్లో ఇమ్యూనిటీ పెంచే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగానే టీనేజ్ పిల్లలను కూడా వ్యాక్సినేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ మొదలు కానుంది. అలాగే జనవరి 10వ తేదీ నుంచి కోవిడ్ వారియర్స్‌కు అదనపు డోసు ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో పలు కొత్త వ్యాక్సిన్‌లకు కూడా డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
