Kolkata: ఒంటరిగా పోటీచేస్తామ‌నీ,  2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎవ‌రితోనూ ఎలాంటి పొత్తులుండవ‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. 2024లో తృణమూల్, ప్రజల మధ్యనే పొత్తు ఉంటుంద‌నీ, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లబోమని చెప్పారు. 

Lok Sabha Election 2024: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాల ఐక్యతపై దెబ్బ‌కొడుతూ.. విప‌క్షాల‌కు పెద్ద షాక్ ఇచ్చారు. 2024 లోక స‌భ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. తాము ఒంటరిగా పోటీచేస్తామ‌నీ, 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎవ‌రితోనూ ఎలాంటి పొత్తులుండవ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. 2024లో తృణమూల్, ప్రజల మధ్యనే పొత్తు ఉంటుంద‌నీ, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లబోమని చెప్పారు.

వివ‌రాల్లోకెళ్తే.. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్ర‌క‌టించారు. 2024లో కేవ‌లం తృణమూల్ కాంగ్రెస్, ప్రజల మధ్య పొత్తు ఉంటుందన్నారు. ఇతర పార్టీలతో కలిసి వెళ్లబోమని చెప్పారు. ప్రజల మద్దతుతో ఒంటరిగా ఎన్నిక‌ల్లో పోరాడతామ‌ని మ‌మ‌తా బెనర్జీ స్పష్టం చేశారు. దీంతో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును రానున్న ఎన్నిక‌ల్లో ఒడించ‌డానికి ప్ర‌తిప‌క్షాలు ఐక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని ప‌లువురు నాయ‌కులు, పార్టీలు చేస్తున్న అంశంపై నీళ్లుజ‌ల్లిన‌ట్టు అయింది. 

"బీజేపీని ఓడించాలనుకునే వారు మనకే ఓటేస్తారని నా నమ్మకం.. అదే సమయంలో సీపీఎం, కాంగ్రెస్‌లకు ఓట్లు వేసే వారు బీజేపీకి వేసినట్లేనని నా నమ్మకం.. ఈ నిజం ఈరోజు వెలుగులోకి వచ్చిందని" త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీలో టీఎంసీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయింది. 

2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే పోటీ చేస్తామ‌నీ, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలనుకునే వారు టీఎంసీకే ఓటు వేస్తారని మ‌మ‌తా బెన‌ర్జీ ధీమా వ్యక్తం చేశారు. 2024లోనూ అదే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా పలువురు ప్రతిపక్ష నేతలు ఏకమవుతున్నా టీఎంసీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం ఆందోళన కలిగిస్తోందని ప‌లువురు నేత‌లు స్పందించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జన్మదినం సందర్భంగా బుధవారం (మార్చి 1) చెన్నైలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సమయంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా నేతలంతా ఏకం కావాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. 

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. 

పశ్చిమ బెంగాల్లోని సాగర్‌దిగి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. బైరాన్ బిస్వాస్ ఇక్కడి నుంచి గెలిచారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి దేబాశిష్ బెనర్జీ రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ మాట్లాడుతూ కాంగ్రెస్-సీపీఎం, బీజేపీల మధ్య అనైతిక పొత్తు ఉందన్నారు. ఈ కారణంగానే ఆయన విజయం సాధించార‌ని విమ‌ర్శించారు. సాగర్‌దిగి అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ తన ఓట్లను కాంగ్రెస్ కు మ‌ళ్లించేలా చ‌ర్య‌లు తీసుకుంద‌ని విమ‌ర్శించారు. బైరాన్ బిశ్వాస్ కు 97,667 ఓట్లు రాగా, టీఎంసీ అభ్యర్థి దేబాశిష్ బెనర్జీకి 64,681 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి దిలీప్ షాకు 25, 815 ఓట్లు వచ్చాయి.