ఈ రోజు బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాలు సుమారు నాలుగు గంటలు సమావేశమయ్యాయి. అనంతరం మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపాయి. అయితే తుది నిర్ణయాలు హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాల వచ్చే నెలలో జరిగే సమావేశంలో తీసుకుంటామని వివరించాయి.
పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. పాట్నాలో సమావేశం రూపంలో ఇందుకు తొలి అడుగు పడింది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ నిర్వహించిన ఈ సమావేశం సుమారు నాలుగు గంటలపాటు సాగింది. ఈ భేటీ సానుకూల ఫలితాలను ఇచ్చిందని విపక్షాలు చెప్పాయి. తామంతా కలిసే ఉన్నామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని తెలిపాయి. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో మరో సమావేశం నిర్వహిస్తామని, అందులో తుది నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించాయి.
ఈ సమావేశం నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌లు మధ్యలో నుంచే వెళ్లిపోయారు. వారి ఫ్లైట్స్ టైమింగ్ కారణంగా వారు తొందరగానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సమావేశానికి ముందు ఆప్ పార్టీ ఒక అల్టిమేటం విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించకుంటే తాము ఈ కూటమిలో భాగం కాబోమని స్పష్టం చేసింది. అయితే, ఇది పార్లమెంటుకు సంబంధించిన వ్యవహారమని, దీనిపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముందు నిర్వహించే సమావేశాల్లో వైఖరి ఖరారు చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
భేటీ అనంతరం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. సీట్ల పంపకాలు, పార్టీల వారీగా విభజనలపై షిమ్లా మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకుంటామని, వాటికి సంబంధించిన వివరాలను అప్పుడే వెల్లడిస్తామని అన్నారు. షిమ్లా మీటింగ్ వచ్చే నెల 10వ తేదీ, లేదా 12వ తేదీల్లో జరుగుతుందని, ఆ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యూహాలు ఖరారు అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 2024 ఎన్నికలను అందరం కలిసి పోరాడాల్సి ఉన్నదని అన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమనే విశ్వాసం ఉన్నదని వివరించారు.
ఇది భావజాలాల పోరాటం అని, తమ మధ్యలో ఎన్నో అంతరాలు ఉండొచ్చని, కానీ, తమ భావజాలాన్ని కాపాడుకోవడానికి కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు రాహుల్ గాంధీ అన్నారు. ఇదొక ప్రక్రియ అని, దీన్ని కొనసాగేలా చూస్తామని వివరించారు.
Also Read: Opposition Unity: విపక్షాల కూటమిలోకి బీఆర్ఎస్? అసెంబ్లీ ఎన్నికల కోసం నిర్ణయం వాయిదా!
మూడు అంశాలపై తీర్మానం చేశామని, ఒకటి తామంతా కలిసి ఉన్నామని, ఐక్యంగా పోరాడుతామని, అలాగే, తమ పోరు విపక్షాల పోరాటంగా కాకుండా బీజేపీ నియంతృత్వానికి, వారి నల్ల చట్టాలు, రాజకీయ కుట్రలపై పోరాటంగా ప్రకటించుకున్నామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇందుకోసం తమ రక్తం ఏరులైనా సరే.. ప్రజలను కాపాడి తీరుతామని అన్నారు. బీజేపీ చరిత్రను మార్చాలని భ్రమపడుతున్నదని, కానీ, ఈ చరిత్రను బిహార్ కాపాడుతందని వివరించారు.
జమ్మ కశ్మీర్‌లో జరిగిన పరిణామాలే ఇప్పుడు దేశమంతటా జరుగుతున్నాయని, ముఖ్యంగా మైనార్టీల పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర నుంచి కన్యాకుమారి వరకు 17 పార్టీలు ఏకతాటి మీదికి వచ్చాయంటే అది అధికారం కోసం కాదని, విలువల కోసమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు.
భావజాల విభేదాలు ఉండొచ్చేమో కానీ, దేశ ప్రజాస్వామిక విలువలపై దాడి జరిగితే తాము తప్పకుండా పోరాడుతామని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ తొమ్మిదేళ్లు దేశంలో వినాశనమే జరిగిందని సీపీఐ నేత డీ రాజా అన్నారు. దేశ సామఖ్యవ్యవస్థపై దాడి జరిగిందని తెలిపారు.
