2024 లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్న ఐక్య కూటమిలోకి బీఆర్ఎస్ చేరుతుందా? అనేది ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉన్నది. అయితే, కొన్ని విశ్వసనీయ వర్గాల ప్రకారం, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున.. అందునా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కావడం వల్ల ఈ కూటమిలో చేరే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. భవిష్యత్‌లో కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయని వివరించింది.  

న్యూఢిల్లీ: 2024 లోక్ సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. బిహార్ సీఎం నితీశ్ కుమార్ చొరవతో జూన్ 23న పాట్నాలో కూటమికి సంబంధించిన కీలక విషయాలపై ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు సమాలోచనలు చేయనున్నారు. ప్రతిపక్ష పార్టీల్లోనూ కేంద్రంలోని బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చే పార్టీలు ఉన్నందున ఈ కూటమిలోకి అన్ని విపక్ష పార్టీలు వచ్చే చాన్స్ లేదు. 

ఈ కూటమి గురించి కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్న తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ గురించి ఎక్కడా పెద్దగా వినిపించలేదు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల కారణంగా బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా కనిపించడం లేదని తెలుస్తున్నది. తెలంగాణలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎలక్షన్స్ ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్షం లేదా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే. అందుకే ఐక్య కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకోవడం రాజకీయంగా ఇబ్బందులను తెచ్చే ముప్పు ఉన్నది.

తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల కారణంగా విపక్ష ఐక్య కూటమిలో బీఆర్ఎస్ ఇప్పుడే వేదిక పంచుకోవడం సాధ్యపడదని అపోజిషన్ మేనేజర్లకు తెలియజేసినట్టు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి బీఆర్ఎస్ ఇష్టపడటం లేదని ఆ వర్గాలు వివరించాయి. బహిరంగంగానూ విపక్ష కూటమికి మద్దతు ప్రకటించే పరిస్థితులు లేవని పేర్కొన్నాయి.

Also Read: కర్ణాటక ఎఫెక్ట్: టీ కాంగ్రెస్‌లో జోష్.. డీలాపడ్డ బీజేపీ!

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమ బహిష్కరణకు అన్ని ప్రతిపక్ష పార్టీలు సంతకం పెట్టాయి. కానీ, బీఆర్ఎస్ మాత్రం సంతకం పెట్టలేదు. అలాగని, ఆ కార్యక్రమానికీ హాజరు కాలేదు. కాబట్టి, భవిష్యత్‌లో అంటే.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ విపక్ష ఐక్య కూటమిలో బీఆర్ఎస్ చేరే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు వివరించాయి.

కాగా, ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలపైనా ఈ నేతలు జాగ్రత్తగా మాట్లాడారు. ఈ రెండు పార్టీలు పరోక్షంగా బీజేపీకే మద్దతు ఇస్తాయనే అభిప్రాయాన్ని తెలిపారు. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల్లో సత్ఫలితాలు వస్తే.. జగన్‌ను అప్రోచ్ అయ్యే మార్గాన్ని తెరిచే ఉంచుకున్నట్టు వివరించారు.

బీఎస్పీ, కర్ణాటకలోని జేడీఎస్ పార్టీలపై వీటికి పెద్దగా ఆశలేమీ లేవు. బీజేపీపై ఐక్య పోరుకు ఈ రెండు పార్టీలు కలిసి వస్తాయనే నమ్మకాలు లేవు. అలాగే, ఒడిశా అధికార పార్టీ బీజేడీ ఇది వరకే దాని వైఖరి స్పష్టం చేసింది. ఈ పార్టీ అధికార పక్షానికి, విపక్షాలకు సమాన దూరం పాటిస్తుంది. అందుకే బీజేపీపై పోరుకు ప్రతిపక్షాలతో నవీన్ పట్నాయక్ పార్టీ కలిసి వస్తుందనే ఆశలు లేవు.