Asianet News TeluguAsianet News Telugu

సర్జికల్ స్ట్రైక్ ఆధారాలేవి అని ప్రశ్నించిన దిగ్విజయ్ సింగ్.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

సర్జికల్ స్ట్రైక్ గురించి ఆధారాలేవీ కేంద్రప్రభుత్వం చూపించలేదని, పుల్వామా ఉగ్రదాడిపై సంశయాలకు సమాధానాలు ఇవ్వలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా, ఆయన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు.
 

we do not need proofs for armed forces exceptional job of surgical strike clarifies rahul gandhi
Author
First Published Jan 24, 2023, 3:34 PM IST

న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రైక్ గురించి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నదని, పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలే లేవని, సర్జికల్ స్ట్రైక్‌ జరిగినట్టూ ఆధారాలేవీ కేంద్ర ప్రభుత్వం చూపెట్టలేదని అన్నారు. పార్లమెంటులోనూ సర్టిజకల్ స్ట్రైక్ గురించి వివరణ ఇవ్వలేదని తెలిపారు. ఇవన్నీ వట్టి అబద్ధాలే అని, కేంద్ర ప్రభుత్వం ఈ అబద్ధాల మీదనే బతుకుతున్నదని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే దేశంలో చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ కూడా రెస్పాండ్ అయ్యారు.

దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని రాహుల్ గాంధీ అన్నారు. అవి దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత వ్యాఖ్యలు అని, పార్టీ వైఖరికి ఆయన వ్యాఖ్యలకు సంబంధం లేదని వివరించారు. తమ పార్టీలో భిన్న అభిప్రాయాలు కలిగి ఉండే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. అయితే, దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు పార్టీ వైఖరికి మరీ దూరంగా ఉన్నాయని వివరించారు. అవి కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయాలేనని, పార్టీ వైఖరితో ఎంతమాత్రం సంబంధం లేదని అన్నారు. తాము ఈ సర్జికల్ స్ట్రైక్ పై స్పష్టతతో ఉన్నామని వివరించారు. భారత సైన్యం అద్భుతమైన కార్యం నిర్వహించిందని, దానికి సంబంధించి తమకు ఎలాంటి సాక్ష్యాధారాలూ అవసరం లేదని స్పష్టం చేశారు.

Also Read: కాంగ్రెస్ డీఎన్‌ఏ పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంటుంది - ‘సర్జికల్ స్ట్రైక్’ వ్యాఖ్యల పై ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

కాంగ్రెస్ సారథ్యంలో భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతుండగా ఈ పాదయాత్రలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ నిన్న అక్కడ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పుల్వామాలో టెర్రరిజం చీడ ఎక్కువగా ఉండేది. ప్రతి కారును చెక్ చేసేవారు. కానీ, ఓ స్కార్పియో కారు రాంగ్ సైడ్ నుంచి వచ్చి బీభత్సం సృష్టించింది. అసలు ఆ కారును ఎందుకు చెక్ చేయలేదు? ఆ కారు ఆర్మీ వ్యాన్‌తో ఢీకొట్టింది. 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ ఘటన వివరాలను పార్లమెంటులో వెల్లడించలేదు. బహిరంగ పరచలేదు’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశామని చెప్పారు. చాలా మంది ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. కానీ, అందుకు సంబంధించిన సాక్ష్యాలేవీ బయటపెట్టలేదని వివరించారు. ఇలా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా అబద్ధాల మీదనే నడుస్తున్నదని పేర్కొన్నారు.

ఈ కామెంట్లకు బీజేపీ రియాక్ట్ అయింది. బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ క్యారెక్టర్ అని విమర్శించారు. మన దేశ ఆర్మీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ఏ భారతీయుడూ ఉపేక్షించబోరని పేర్కొన్నారు. ప్రధాని మోడీపై వారికి ఉన్న ద్వేషం కారణంగా ఇప్పుడు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లలో ఏ మాత్రం దేశ భక్తి లేకుండా పోయిందని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios