ఇన్‌ఫ్రా డెవలప్ మెంట్ భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా భావిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ ప్రభుత్వం అనేక రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా ప్రభుత్వం పరిగణిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్‌పై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బడ్జెట్ దేశంలో మౌలిక సదుపాయాల రంగం వృద్ధికి కొత్త శక్తిని అందిస్తుందని అన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా పరిగణిస్తున్నామని, ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యాన్ని భారత్ సాధిస్తుందని మోదీ అన్నారు. ఇప్పుడు ఈ అభివృద్ధి వేగాన్ని పెంచి టాప్ గేర్‌లో పయనించాల్సిన అవసరం ఉందని, ఇందులో ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి అన్ని రంగాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇది వ్యాపారాల పోటీతత్వాన్ని పెంపొందించడంలో, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. 2013-14తో పోలిస్తే ప్రభుత్వ మూలధన వ్యయం 5 రేట్లు పెరిగిందని ప్రధాని అన్నారు.
స్కూల్ ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు.. 9వ తరగతి బాలిక ఆత్మహత్య
‘‘ఏ దేశ అభివృద్ధిలోనైనా మౌలిక సదుపాయాలు ఎప్పుడూ ముఖ్యమే. మౌలిక సదుపాయాలకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేసేవారికి ఈ విషయం బాగా తెలుసు’’ అని పలు ఉదాహరణలను వివరించారు. దశాబ్దాలుగా పేదరికం ఒక సుగుణం అనే ఆలోచన భారతదేశంలో ఉందని, గత ప్రభుత్వాలు దేశ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాయని మోడీ అన్నారు. అయితే తమ ప్రభుత్వం ఈ ఆలోచన నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడమే కాకుండా ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతోందని అన్నారు.
ఫలితంగా 2014 నుంచి జాతీయ రహదారుల సగటు వార్షిక నిర్మాణం దాదాపు రెట్టింపు అయిందని, రైల్వే లైన్ల విద్యుదీకరణ 600 రూట్ కిలోమీటర్ల నుంచి 4,000 రూట్ కిలోమీటర్లకు పెరిగిందన్నారు. కాగా.. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద రాబోయే కాలంలో రూ. 110 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
