ఉత్తరప్రదేశ్‌కు చెందిన 9వ తరగతి బాలికను ఫీజు కట్టలేదని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పరీక్ష రాయనివ్వలేదు. దీంతో వెనుదిరిగిన ఆ బాలిక ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది.
లక్నో: స్కూల్ ఫీజు కట్టలేదని 9వ తరగతి బాలికను స్కూల్ యాజమాన్యం పరీక్ష రాయనివ్వలేదు. కొంత సమయం ఇస్తే ఆ ఫీజు కట్టేస్తామని బాలిక తల్లిదండ్రులు ప్రాధేయపడినా ఆ స్కూల్ యాజమాన్యం వినిపించుకోలేదు. ఆమెను పరీక్ష రాయడానికి అనుమతించలేదు. దీంతో ఇంటికి వచ్చిన 14 ఏళ్ల బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.
బరదారి నివాసి అశోక్ కుమార్ 14 ఏళ్ల కూతురు 9వ తరగతి చదువుతున్నది. ఓ స్థానిక ప్రైవేటు స్కూల్‌లో చదివించాడు. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా స్కూల్ ఫీజును తాను డిపాజిట్ చేయలేకపోయాడని అశోక్ కుమార్ తెలిపాడు. ఆ ఫీజు చెల్లించడానికి కొంత సమయం ఇవ్వాలని తాను స్కూల్ యాజమాన్యాన్ని కోరినట్టు వివరించాడు. కానీ, శుక్రవారం జరిగిన పరీక్షకు తన కూతురిని హాజరు కానివ్వలేదని ఆరోపించాడు. పోలీసులను ఆశ్రయించి ఈ ఫిర్యాదు చేశాడు. తనను పరీక్ష రాయనివ్వకపోవడంతో ఆ బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ రాహుల్ భాటి కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.
