న్యూఢిల్లీ: ప్రపంచ యుద్ధంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం నాడు  న్యూఢిల్లీలో  మీడియాతో మాట్లాడారు.ప్రతి వ్యక్తి కూడ కరోనా వైరస్ పై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన  అభిప్రాయపడ్డారు. 

also read:ఈశాన్య రాష్ట్రాలకు పాకిన కరోనా: మణిపూర్ లో తొలి పాజిటివ్ కేసు

జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు సహకరించిన తీరును ఆయన అభినందించారు. ఒక్క రోజు పాటు యుద్దం చేస్తే సరిపోదన్నారు. కరోనా కారణంగా ఇటలీ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమెరికాలో కూడ కరోనా వ్యాప్తి చెందుతోందన్నారు. ఇటలీ అనుభవాలు మనకు గుణపాఠం కావాల్సిన అవసరం ఉందన్నారు.

జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా మంత్రి చెప్పారు.లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు.

చైనా మన దేశానికి సరిహద్దు దేశమైనప్పటికీ ఆలస్యంగానే దేశంలోకి ఈ వైరస్ ప్రవేశించిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతి వ్యక్తి స్వీయ నిర్భంధం పాటించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి సూచించారు.