Rishi Sunak: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మాట్లాడుతూ తన అల్లుడు రిషి సునక్ తదుపరి బ్రిటన్ ప్రధానమంత్రి కాబోతున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.
Infosys co-founder Narayana Murthy: బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి రిషి సునక్‌కి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి శుభాకాంక్షలు తెలిపారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కి తదుపరి ప్రధానమంత్రి కాబోతున్న తన అల్లుడు రిషి సునక్ పట్ల గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, రిషి సునక్ బ్రిటన్ మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి. అలాగే, ఆయన ఒక హిందువు. 42 ఏళ్ల సునక్ ఆదివారం కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించే రేసులో గెలిచారు. ఇప్పుడు భారతీయ సంతతికి చెందిన ఒక హిందు వ్యక్తి బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యలు తీసుకోబోతున్నారు.
"రిషి సునక్ కు అభినందనలు. మేము అతనిని చూసి గర్విస్తున్నాము. అతని విజయాన్ని కోరుకుంటున్నాము" అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. "యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజల కోసం అతను తన వంతు కృషి చేస్తాడని మాకు నమ్మకం ఉందని తెలిపారు.
కాగా, రిషి సునక్ యార్క్‌షైర్ నుంచి మొదటగా ఎంపీగా గెలిచారు. ఆయన పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేసి తన ప్రమాణస్వీకారం చేశారు. ఇలా చేసిన తొలి యూకే పార్లమెంట్ సభ్యుడు. రిషి సునాక్ తల్లి తండ్రి పూర్వీకులు భారతీయులు. వారు పంజాబ్ కు చెందిన వారు. రిషి సునాక్ తల్లదండ్రులు ఫార్మాసిస్టులు. ఈస్ట్ ఆఫ్రికా నుంచి 1960లో యూకేకు వలస వెళ్లిపోయారు. సునాక్ తండ్రి యశ్వీర్ సునాక్ నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టీషనర్. తల్లి ఉషా సునాక్ ఓ కెమిస్ట్ షాప్ నిర్వహించేవారు. రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ్ మూర్తి కూతురు అక్షత మూర్తీని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పేర్లు క్రిష్ణ, అనౌష్క.
రిషి సునాక్ తరుచూ తమ వారసత్వ సంపద, కుటుంబం గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడుతుంటారు. విలువలు, సంస్కృతి గురించి చర్చిస్తారు. ఆయన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేశారు. ఆయన మాజీ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకర్. రిషి సునాక్ తరుచూ సతీ, పిల్లల సమేతంగా బెంగళూరుకు వచ్చి పోతూ ఉంటారు. తన అత్తవారిని కలిసి వెళ్లుతుంటారు. 2022 వేసవిలో ప్రధాని పోస్టు కోసం క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆయన విలాసవంతమైన నివాసం, ఖరీదైన సూట్లు, షూల గురించి తరుచూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సందర్భంలో తాను సంక్లిష్ట పరిస్థితులు, ఒత్తిళ్లలో ఉన్నప్పుడు భగవద్గీతనే కాపాడుతుందని అన్నారు.
కాగా, సోమవారం జరిగిన పరిణామాల వల్ల బ్రిటన్ కు 200 ఏళ్లలో అతి చిన్న వయస్సులో రిషి (42 సంవత్సరాలు) ప్రధాని అయ్యారు. 1812 తరువాత ఇంత తక్కువ వయస్సున్న వ్యక్తి ప్రధాని కావడం ఇదే ప్రథమం. ఒక సారి రాజు ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించిన తరువాత ఆయన తదుపరి బ్రిటిష్ ప్రధానమంత్రి కానున్నారు.
