Asianet News TeluguAsianet News Telugu

గ్లోబల్ సౌత్‌కు మేమే లీడర్ అని భారత్ అనడం లేదు.. 80 దశకాల్లోని ఆలోచనలు వదులుకోవాలి: కేంద్రమంత్రి జైశంకర్

గ్లోబల్ సౌత్‌కు మేమే లీడర్ అని భారత్ అనలేదని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. నేడు మన దేశం అనేక రంగాల్లో విజయాలు నమోదు చేస్తున్నదని, వ్యాక్సిన్ మొదలు పెడితే చంద్రుడిని అందుకోవడం వరకు అని చెప్పారు. ఈ విజయపరంపర గ్లోబల్ సౌత్‌లో ఒక ఆశాజనక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నదని కేంద్రమంత్రి వివరించారు.
 

we are not saying we are the leader of global south says union minister s jaishankar kms
Author
First Published Sep 18, 2023, 1:11 PM IST | Last Updated Sep 18, 2023, 1:11 PM IST

న్యూఢిల్లీ: గ్లోబల్ సౌత్‌కు తామే లీడర్ అని భారత్ అనడం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సుస్థిరంగా నిలబడి ఎదిగే సామర్థ్యం మనలోని దేశానికి ఉన్నదనే అభిప్రాయాలు గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిధ్యం వహించే దేశాల్లో ఉన్నాయని వివరించారు. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌లో అంబాసిడర్ టీపీ శ్రీనివాసన్‌కు కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ సమాధానాలు చెప్పారు.

‘గ్లోబల్ సౌత్‌ గురించి నాకు చాలా దేశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. మీరు ప్రస్తావించిన దేశాలు సహా ప్రశ్నలు వేశాయి. అసలు గ్లోబల్ సౌత్ అంటే ఏమిటీ?, గ్లోబల్ సౌత్‌ను నిర్వచించండి? ఇలా చాలా ప్రశ్నలు అడిగారు. కానీ, నేను అత్యంత విశ్వసనీయంగా చెబుతున్నదేమిటంటే.. గ్లోబల్ సౌత్ అనేది ఒక నిర్వచనం కాదని, గ్లోబల్ సౌత్ అనేది ఒక అనుభూతి, సంఘీభావ అనుభూతి’ అని వివరించారు.

‘గ్లోబల్ సౌత్‌ను నిర్వచించాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో భాగంగా ఉన్న దేశాలకు ఇదేమిటో తెలుసు, లేని దేశాలకు కూడా తెలుసు. తరుచూ కొందరు వచ్చి మేం కూడా మీ గ్లోబల్ సౌత్‌లో భాగమేనని అంటుంటారు. మేం వారిని మర్యాదగా హ్యాండిల్ చేస్తాం. వాస్తవానికి మేం 125 దేశాలను గ్లోబల్ సౌత్ గళంలో భాగంగా సంప్రదించాం’ అని చెప్పారు. 

మరింత వివరణ ఇస్తూ.. ‘గ్లోబల్ సౌత్‌కు మేమే నాయకులం అని చెప్పడం లేదు. మనం చెప్పేదేమిటంటే, గ్లోబల్ సౌత్‌ గళానికి మనదాన్నీ జోడిస్తాం. మనం కూడా అందులో భాగమే’

ఢిల్లీలో నిర్వహించిన జీ20 సదస్సులో భారత ప్రధానమంత్రి మోడీ చెప్పిన విషయాల్లో కేంద్రమంత్రి జైశంకర్ సంభాషణలోనూ ధ్వనించాయి. అప్పుడు ప్రధాని మాట్లాడుతూ.. గ్లోబల్ సౌత్ దేశాలు ప్రపంచ అజెండాను ప్రభావితం చేసే దిశగా ఎదుగుతున్నాయని, ముఖ్యంగా పర్యావరణ మార్పులు, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల విషయంలో వాటి ప్రభావం పెరిగే అవకాశం ఉన్నదని వివరించారు.

అభివృద్ధి చెందిన దేశాలతో కలిసిన సందర్భాల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయని ప్రధాని చెప్పారు. నేడు అభివృద్ధి చెందిన దేశాలే గ్లోబల్ సౌత్ శక్తిని గుర్తిస్తున్నాయని, ప్రపంచ వేదిక పై ఈ దేశాల శక్తిని, అవసరాలను సానుకూలంగా గుర్తిస్తున్నాయని వివరించారు. గ్లోబల్ సౌత్‌కు కీలకమైన అంశాలైన పర్యావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ, ఆహార భద్రత, ఆరోగ్యం, శక్తి వంటివాటిపై భారత్ ఈ జీ20 సదస్సులో ప్రధానంగా చర్చకు పెట్టింది.

ఈ గళం పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఎత్తిందా? అని అడగ్గా.. కాదని, ఇది గ్లోబల్ సౌత్ కోసం ఎత్తినదేనని కేంద్రమంత్రి జైశంకర్ వివరించారు. ‘ఈ రోజు సమస్య పశ్చిమ దేశాలతో కాదు. ఉదాహరణకు మన దేశాన్నే తీసుకుందాం. మీరు మార్కెట్‌కు వెళ్లారనుకోండి.. అక్కడ చాలా మంది కళాకారులు, చేతివృత్తుల కళాకారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. వారు పశ్చిమ దేశాల ఒత్తిడి కింద ఉన్నారా? నేడు సబ్సిడీలు, మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాల ద్వారా గూడ్స్ తయారై ఏ దేశాల నుంచి మన దేశానికి వస్తున్నాయి? అవి పశ్చిమ దేశాల నుంచి రావడం లేదు’ అని తెలిపారు.

Also Read: పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం.. చరిత్రను గుర్తుచేసుకున్న మోదీ.. కీలక పాయింట్స్ ఇవే..

1980, 90 దశకాల మనస్తత్వాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నదని కేంద్రమంత్రి అన్నారు. ‘నేడు గ్లోబలైజేషన్ మాడల్ మారింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సబ్సిడీలు, అప్పుల ఆధారంగా జరుగుతున్నది. అదే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నది’ అని వివరించారు.

నేడు మన ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతులు, విజ్ఞాన విజయాలు, టీకాలు, టీకాల పంపిణీ సామర్థ్యాలు, చంద్రుడిని అందుకోవడం వరకు మన విజయాల పరంపర ఉన్నది. ఇవన్నీ మన గ్లోబల్ సౌత్‌లో ఒక రకమైన అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. ఈ రోజు మన గ్లోబల్ సౌత్‌లోని ఓ దేశం నిలబడి, పురోగతి వైపు వడిగా ప్రయాణిస్తున్నదనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. తద్వార ఇతర దేశాలు కూడా ఏదో ఒక రోజు ఈ విజయాలను సాధించుకోవాలనే కలలు కంటున్నాయి. మనల్ని చూస్తున్నట్టు వేరే దేశాలను చూడటం లేదు’ అని కేంద్రమంత్రి చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios