లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీని తాను ఆలింగనం చేసుకోవడంపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు.

న్యూఢిల్లీ: లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీని తాను ఆలింగనం చేసుకోవడంపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. మోడీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకుని ఆ తర్వాత కన్ను గీటడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

నరేంద్ర మోడీ ద్వేషాన్ని, భయాన్ని తాను ప్రేమ, సహనంతో జయిస్తానని ఆయన అన్నారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండా ప్రధాని మోడీ రాహుల్ గాంధీ తనను ఆలింగనం చేసుకున్న విషయంపై ఉత్తరప్రదేశ్ లోని ఓ సభలో విమర్శించారు. ఆ విమర్శ చేసిన కొద్దిసేపటికే రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ఆ విధంగా స్పందించారు. 

"నిన్నటి పార్లమెంటులో చర్చలో కీలక అంశం ఇదీ... ప్రధాని మోడీ తన కథ అల్లుకునేందుకు దేశంలోని కొందరిలో ఉన్న ద్వేషాన్ని, భయాన్ని, ఆగ్రహాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే దేశాన్ని నిర్మించేందుకు భారతీయులందరి హృదయాల్లోని ప్రేమ, సహనమే మార్గమని మేము నిరూపించబోతున్నాం" అని రాహుల్ అన్నారు.

ప్రధానమంత్రి కుర్చీ దగ్గరకు వాళ్లు (రాహుల్) ఎలా పరుగెత్తుకొచ్చారో మీరంతా చూశారు. వాళ్లకు ప్రధానమంత్రి కుర్చీ తప్ప మరేమీ కనిపించదని మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్ పూర్ బహిరంగ సభలో అన్నారు.

 ప్రభుత్వంపై ఎందుకు విశ్వాసం లేదని అడిగితే... సమాధానం చెప్పలేక తన వద్దకు వచ్చి ఆలింగనం చేసుకున్నారని ప్రధాని ఎద్దేవా చేశారు.

Scroll to load tweet…