పాకిస్థాన్ చెర నుంచి బయటపడిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ కి చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన పాకిస్థాన్ కి చెందిన ఓ టీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లుగా.. ఆ టీ చాలా బాగుందని చెబుతండటం ఆ వీడియో సారాంశం. ఒక్కసారిగా ఆ వీడియో చూసి.. ఇండియన్ నెటిజన్లు షాకయ్యారు. అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

ఇంటకీ మ్యాటరేంటంటే...  పాకిస్తాన్ వైమానిక దళాలు, ఐఏఎఫ్ దళాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత పాక్ భూభాగంలో పడిపోయిన అభినందన్‌ను పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల తర్వాత ఈ నెల 1న అభినందన్ స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన టీ కంపెనీ ‘తాపల్’ ప్రకటన హల్‌చల్ చేస్తోంది. అభినందన్ టీ తాగుతూ... ‘‘టీ చాలా బాగుంది. థాంక్యూ..’’ అంటూ ఇందులో కనిపిస్తుంది.
 
ఈ వీడియో కనిపించింది మొదలు.. ట్విటర్, వాట్సాప్ సహా అన్ని సోషల్ మీడియా వేదికలపైనా నెటిజన్లు షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ వీడియో గురించి ఆరా తీయగా.. పాక్ చెరలో ఉండగా అభినందన్ టీ తాగుతూ అక్కడి అధికారులతో మాట్లాడిన వీడియో ఇది. ఇందులో టీ తాగుతున్న దృశ్యాన్ని కత్తిరించి ఇలా యాడ్‌లో పెట్టారన్నమాట. అయితే సదరు యాడ్ తాలూకు వీడియో తాపల్ కంపెనీ విడుదల చేయలేదనీ... ఎవరో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని కూడా తేలింది