న్యూడిల్లీ:  ఇండో-చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తత అంతం కావాలని, శాంతి పరిరక్షించాలని తాము కోరుకొంటున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 

దేశ రక్షణ కోసం భారత సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన కొనియాడారు. రెండు దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యే ఘటనలు చోటు చేసుకొంటున్నాయని ఆయన  చెప్పారు.

దసరాను పురస్కరించుకొని వాస్తవాధీన రేఖకు రెండు కిలోమీటర్ల దూరంలో సిక్కిం షెరాథాంగ్ వద్ద ఆయన సైనికులతో శాస్త్ర పూజ నిర్వహించారు.ఆయుధాలు, పరికరాలు, సాయుధ వాహనాలను కేంద్ర మంత్రి పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

దేశ సరిహద్దుల్లో సేవలు చేస్తున్న సైనికుల అంకిత భావాన్ని ప్రశంసించారు.  అమరుల త్యాగాలను దేశం చూసి గర్విస్తోందని ఆయన చెప్పారు.చైనాతో సరిహద్దులో నెలకొన్న వివాదం త్వరగా సమిసిపోవాలని భారత్ కోరుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు.

Also read:భారత వాయిసేనలోకి రఫెల్ యుద్ధ విమానాలు: రాఫెల్, తేజాస్ యుద్ధ విమానాల ప్రదర్శన

 

భారత సైనికులు ఇంచు భూమిని కూడ ఇతరుల చేతుల్లోకి పోనివ్వరని ఆయన తేల్చి చెప్పారు.అంతకు ముందు ఆయన ఆర్మీ చీఫ్ నరవాణేతో కలిసి ఆయన సందర్శించారు. యుద్ద స్మారకం వద్ద అమరవీరులకు కేంద్ర మంత్రి నివాళులర్పించారు.

భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర  రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైనికులతో ఆయుధపూజలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకొంది.