న్యూఢిల్లీ:భారత వాయుసేనలోకి రఫెల్ యుద్ధ విమానాలు గురువారం నాడు చేరాయి. గోల్డెన్ యారోస్ 17వ, స్క్వాడ్రన్ లో రాఫెల్ భాగమయ్యాయి.

రఫెల్ యుద్ధ విమానాలకు గురువారం నాడు సర్వ ధర్మపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ప్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

చైనా, ఇండియా సరిహద్దులో చోటు చేసుకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐదు రాఫెల్ మల్టీరోల్ ఫైటర్ జెట్ల మొదటి బ్యాచ్ హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో   భారత వైమానిక దళంలో భాగంగా మారాయి.

రాఫెల్, తేజాస్ యుద్ధ విమానాల ప్రదర్శన నిర్వహించారు.ఈ వేడుక భారత  వైమానిక చరిత్రలో అతి ముఖ్యమైందిగా వైమానిక దళ అధికారి ఒకరు ప్రకటించారు.

రాఫెల్ జెట్ యుద్ధ విమానాలకు సంప్రదాయంగా వాటర్ ఫిరంగి సెల్యూట్ చేశారు. రూ. 59 వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగింది. నాలుగేళ్ల క్రితం ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూలై 29వ తేదీన తొలి బ్యాచ్ లో రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు చేరుకొన్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు వచ్చాయి. మరో ఐదు యుద్ధ విమానాలు ఐఎఎఫ్ పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ లోనే ఉన్నాయి. 2021 నాటికి ఈ యుద్ధ విమానాలు ఇండియాకు రానున్నాయి.

రెండో విడత రాఫెల్ యుద్ధ విమానాలు ఈ ఏడాది నవంబర్ నాటికి ఇండియాకు వస్తాయి. నాలుగు లేదా ఐదు యుద్ధ విమానాలు ఇండియాకు వస్తాయి.రాఫెల్ యుద్ధ విమానం శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉంటుంది. సుదూర లక్ష్యాలను  కూడ రాఫెల్ చేధించనుంది.

36 రాఫెల్ యుద్ధ విమానాల్లో 30 యుధ్ద విమానాలు వాయుసేనలో ఉంటాయి. మిగిలిన ఆరు యుద్ధ విమానాలను శిక్షణకు ఉపయోగిస్తారు. రాఫెల్ జెట్ విమానాలు అంబాలా వైమానిక స్థావరంలో ఉన్నాయి. రెండవ బ్యాచ్ విమానాలు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హసీమారాలో ఉంటుంది.