వీధి కుక్కల దాడిలో వాఘ్ బక్రీ టాప్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ దేశాయ్ మృతి..
వాఘ్ బక్రీ అధినేత పరాగ్ దేశాయ్ చనిపోయారు. కుక్కల దాడిలో గాయపడిన ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించారు. ఆయన మరణం పట్ల గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ సంతాపం వ్యక్తం చేశారు.
వాఘ్ బక్రీ టీ అధినేత, ఆ గ్రూప్ టాప్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న వ్యాపారవేత్త పరాగ్ దేశాయ్ (49) కన్నుమూశారు. ఆయన గత ఆదివారం తన ఇంటి బయట వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న మరణించారు. అక్టోబర్ 15న తనపై దాడి చేసిన వీధి కుక్కలను తరిమికొట్టే ప్రయత్నంలో దేశాయ్ కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయని ‘అహ్మదాబాద్ మిర్రర్’ తెలిపింది.
దీనిని ఆ ఇంటి ఎదుట ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించారు. వెంటనే పరాగ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు స్పందించి, ఆయనను షెల్బీ ఆసుపత్రికి తరలించారు. షెల్బీ ఆసుపత్రిలో ఒక రోజు చికిత్స పొందిన తరువాత, మెరుగైన చికిత్స కోసం జైడస్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం బ్రెయిన్ హెమరేజ్ తో మృతి చెందాడు.
దేశాయ్ మృతికి గుజరాత్ కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభ సభ్యుడు శక్తిసిన్హ్ గోహిల్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. ‘‘ చాలా బాధాకరమైన వార్త విన్నాను. వాఘ్ బక్రీ టీ డైరెక్టర్, యజమాని పరాగ్ దేశాయ్ కన్నుమూశారు. కిందపడటంతో ఆయనకు బ్రెయిన్ హెమరేజ్ అయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. భారతదేశం అంతటా ఉన్న మొత్తం వాఘ్ బక్రీ కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.
వాఘ్ బక్రీ టీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రసేష్ దేశాయ్ కుమారుడు పరాగ్ దేశాయ్. ఆయనకు భార్య విదిష, కుమార్తె పరిష ఉన్నారు. ఎక్స్ఛేంజ్ 4మీడియా ప్రకారం.. దేశాయ్ 30 సంవత్సరాలకు పైగా వ్యవస్థాపకత అనుభవంతో, గ్రూప్ ఇంటర్నేషనల్ బిజినెస్, సేల్స్, మార్కెటింగ్ కు నాయకత్వం వహించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వంటి ప్రముఖ పరిశ్రమ వేదికలలో చురుకుగా పాల్గొని పరిశ్రమ గౌరవనీయమైన గొంతుకగా నిలిచారు.
వాఘ్ బక్రీ టీ గ్రూప్ ను 1892లో నారదాస్ దేశాయ్ స్థాపించారు. నేడు రూ.2,000 కోట్ల టర్నోవర్ ఉంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, పశ్చిమబెంగాలో ఈ గ్రూప్ విస్తరించి ఉంది.