Asianet News TeluguAsianet News Telugu

విమానంలో సిబ్బందిని కొట్టి, ఉమ్మేసి, అర్థనగ్నంగా నడుస్తూ.. ప్రయాణికురాలి వీరంగం, అరెస్ట్..

విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు హల్ చల్ సృష్టించింది. క్యాబిన్ క్రూ మీద దాడిచేసి, ఉమ్మేసి.. అర్థనగ్నంగా తిరుగుతూ కలకలం రేపింది. చివరికి అరెస్టయ్యింది. 
 

Vistara airlines Italian  woman passenger punches, spits on  Cabin Crew, Stripped her self, held in mumbai - bsb
Author
First Published Jan 31, 2023, 12:10 PM IST

ముంబై : విస్తారా అబుదాబి-ముంబై విమానంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రయాణికురాలు విమాన సిబ్బందిపై దాడి చేసింది. ఉమ్మివేసి దారుణంగా వ్యవహరించింది. ఇలా చేసిన 45 ఏళ్ల ఇటాలియన్ మహిళను సోమవారం అరెస్టు చేశారు. ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ తో విమానం ఎక్కిన పావోలా పెరుక్కియో అనే ఇటాలియన్ మహిళ, బిజినెస్ క్లాస్‌లో కూర్చోవాలని పట్టుబట్టింది. ఆమెను ఆపే ప్రయత్నం చేసినందుకు సిబ్బందిపై దాడికి పాల్పడిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. 

ఓ క్యాబిన్ సిబ్బందిని కొట్టి, మరొకరిపై ఉమ్మి వేసి, విమానంలో అర్థ నగ్నంగా నడిచింది. క్యాబిన్ క్రూ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు, అయితే, ఆమెకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పెర్రుక్సియో "వికృత, హింసాత్మక ప్రవర్తన" కారణంగా విమానం మధ్యలోనే ఆమెకు హెచ్చరిక కార్డు జారీ చేసి.. ఆమెను అదుపుచేయాల్సి వచ్చింది.

"నిరంతర వికృత ప్రవర్తన, హింసాత్మక ప్రవర్తన దృష్ట్యా, కెప్టెన్ హెచ్చరిక కార్డ్‌ను జారీ చేసి, కస్టమర్‌ను నిరోధించేందుకు నిర్ణయం తీసుకున్నాడు. పైలట్.. ఇతర ప్రయాణికులకు భద్రత గురించి భరోసా ఇవ్వడానికి క్రమం తప్పకుండా ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. ఆన్-గ్రౌండ్‌లోని సెక్యూరిటీ సిబ్బందికి విషయం వివరించి కఠినమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు) ను నియమాలకు అనుగుణంగా చేపట్టాలని కోరాం" అని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రయాణికుల మూత్ర విసర్జనతో ఎయిర్ ఇండియాకు తంటాలు.. రెండో ఘటన రిపోర్ట్ చేయలేదని రూ. 10 లక్షల ఫైన్

ఆమె విమానంలో తన బట్టలు కొన్ని తీసివేసి, అర్థ నగ్న స్థితిలో విమానంలో అటూ, ఇటూ నడిచింది, బూతులు తిడుతూ, సిబ్బందిపై దాడి చేసింది. ప్రయాణికురాలిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు ఒక రోజులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. "విమాన ప్రయాణికురాలు... గాలిలో ఉండగా దురుసుగా ప్రవర్తించిన కేసులో ముంబై పోలీసులు రికార్డు సమయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు" అని పోలీసులు తెలిపారు.

భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేయడానికి ముందు.. మహిళకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సహ ప్రయాణీకులు, సిబ్బంది, ఇతరుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయడానికి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు.

విమాన ప్రయాణీకులు.. తమ తోటి ప్రయాణికులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన అనేక షాకింగ్ సంఘటన ఇటీవలి కాలంలో చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా కొద్ది రోజుల కిందట.. న్యూయార్క్‌-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేయడం.. దాన్ని సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిని విధుల నుంచి తొలగించారు. మరో ఎయిరిండియా ప్యారిస్-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఓ మహిళా ప్రయాణికురాలు ఖాళీగా ఉన్న సీటుపై, దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. మరో ప్రయాణికుడు కూడా మత్తులో ఉన్నాడు, లావెటరీలో ధూమపానం చేస్తూ, సూచనలకు స్పందించడానికి నిరాకరించాడు.

ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరవడానికి ప్రయత్నించిన మరో రెండు సంఘటనలు కూడా ఆందోళన కలిగించాయి. రెండు రోజుల క్రితం నాగ్‌పూర్ నుండి ముంబై ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు విమానం గాలిలో ఉన్నప్పుడు, ల్యాండింగ్ సమయంలో అత్యవసర ద్వారం కవర్‌ను తొలగించడానికి ప్రయత్నించాడు.

గత ఏడాది డిసెంబరు 10న ఇండిగో, చెన్నై-తిరుచిరాపల్లి విమానంలో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచినట్లు నేషనల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వెల్లడించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆ ప్రయాణికుడు తేజస్వి సూర్య అని ధృవీకరించారు. అతను "పొరపాటున" ఆ తలుపు తెరిచాడని,  దానికి క్షమాపణలు కూడా చెప్పాడని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios