Asianet News TeluguAsianet News Telugu

లోదుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లాను.. జార్ఖండ్ సీఎం సోదరుడి కామెంట్.. మండిపడుతున్న విపక్షాలు

జార్ఖండ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చేలా ఉన్నాయి.

visit delhi to buy undergarments says Hemant Soren brother basant
Author
First Published Sep 8, 2022, 3:45 PM IST

జార్ఖండ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చేలా ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన బసంత్ సోరెన్ ఖిజురియాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను లోదుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లనానని చెప్పారు. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలకు మరో అస్త్రం దొరికనట్టైంది. ఇక, బసంత్ సోరెన్ రాష్ట్రంలోని దుమ్కానియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇటీవల దుమ్కాలో చోటుచేసుకున్న అత్యాచారం, హత్య ఘటనను ప్రస్తావిస్తూ విపక్షలు బసంత్‌పై విమర్శలకు దిగాయి. పేదలు, గిరిజనుల నాయకుడు శిబు సోరెన్ కుమారుడు ఇప్పుడు లోదుస్తులు కొనడానికి దుమ్కా నుండి ఢిల్లీకి వెళ్లారా? అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఎద్దేవా చేశారు. అందుకే ఆయన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాలేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు.

అసలు బసంత్ సోరెన్ ఏం చెప్పారంటే..
మీడియా సమావేశంలో బసంత్‌ను విలేకరులు ఆయన ఢిల్లీ పర్యటన గురించి అడిగారు. ‘‘అవును, నేను ఢిల్లీకి వెళ్లాను. నిజానికి నా దగ్గర లోదుస్తులు అయిపోయాయి. అందుకే వాటిని కొనుగోలు  చేసేందుకు ఢిల్లీ వెళ్లాను. నేను అక్కడ వాటిని తీసుకున్నాను’’ అని బసంత్ సోరెన్ వెటకారంగా సమాధానమిచ్చారు.  అయితే విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళాన్ని బసంత్ సోరెన్ అంగీకరించారు. అయితే పరిస్థితులు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయని చెప్పారు. 

ఇక, సీఎం హేమంత్ సోరెన్‌ పేరు మీద గనుల తవ్వకం లీజు ఉందని, ఆయన లాభదాయక పదవిని నిర్వహిస్తున్నారని బీజేపీ బృందం గవర్నర్ రమేష్ బయిస్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసింది. ఆయనను ఎమ్మెల్యేగా అనర్హులుగా ప్రకటించాలని కోరింది. అయితే బీజేపీ ఫిర్యాదును గవర్నర్.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువరించనప్పటికీ.. హేమంత్ సోరెన్‌ను ఎమ్మెల్యేగా అనర్హునిగా ప్రకటించాలని గవర్నర్‌కు సిఫారసు చేసినట్టుగా అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. దీంతో జార్ఖండ్‌లో గత నెల చివర్లో రాజకీయ సంక్షోభం మొదలైంది.  

ఈ క్రమంలోనే ఫిరాయింపుల భయంతో జార్ఖండ్‌లోని అధికార యూపీఏ ఎమ్మెల్యేలను గత నెలలో కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లోని రిసార్ట్‌కు తరలించారు. దీంతో జార్ఖండ్‌లో రాజకీయ హైడ్రామా చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆరు రోజులుకు వారిని తిగిరి రాంచీకి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి.. అసెంబ్లీలో హేమంత్ సోరెన్‌ విశ్వాస పరీక్షను ప్రతిపాదించారు. విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ నెగ్గినప్పటికీ.. ఆయన ఎమ్మెల్యే అర్హతపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక, విశ్వాస పరీక్ష సందర్భంగా.. ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో బీజేపీ అంతర్యుద్ధం, అల్లర్ల వాతావరణాన్ని సృష్టిస్తోందని హేమంత్ సోరెన్ ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios