Visakhapatnam: విశాఖపట్నంలో కొందరు దుండగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్లు రువ్వారు. రైలుపై రాళ్లతో దాడి చేయడంతో ఒక బోగీ కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. దీంతో విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరిందని సంబంధిత అధికారులు తెలిపారు.
Vande Bharat Express train attacked with stones: విశాఖపట్నంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. కొందరు దుండగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్లు విసరడంతో రైలు (సీ-8)లోని ఒక బోగీ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. దీంతో దాడికి గురైన విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరడానికి నాలుగు గంటలు ఆలస్యమైందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు వైజాగ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ఖమ్మం రైల్వే అధికారులు తెలిపారు.
దుండగుల రాళ్ల దాడి కారణంగా సీ-8 కోచ్ కిటికీ అద్దాలు పగిలిపోవడంతో బుధవారం విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను 05:45 గంటలకు బయలుదేరడానికి రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేరు డివిజన్ రైల్వే అధికారిక ప్రకటనలో తెలిపింది. "మెయింటెనెన్స్, రైలు రన్ కోసం విశాఖపట్నం చేరుకున్న విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. విశాఖ స్టేషన్ నుంచి కోచ్ కేర్ సెంటర్ కు మెయింటెనెన్స్ కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రైలు ఆలస్యంగా బయలుదేరనుంది" అని డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ ఎం) అనూప్ కుమార్ సేతుపతి తెలిపారు.
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామనీ, నిందితుల కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) గాలిస్తోందని తెలిపారు. కంచరపాలెం సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కోచ్ పై రాళ్లు రువ్వడంతో కొత్త వందేభారత్ రైలు బోగీ అద్దాలు పగిలిపోయాయని అనూప్ కుమార్ సేతుపతి తెలిపారు. "సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. దాడికి పాల్పడిన వారి కోసం ఆర్పీఎఫ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి పనులు చేయవద్దని కోరుతున్నాము. పగిలిన కిటికీ గ్లాసుల ఖరీదు లక్షల్లో ఉంటుంది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము" అని తెలిపారు.
గత మూడు నెలల్లో విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లదాడి ఘటన జరగడం ఇది మూడోసారి. ఫిబ్రవరిలో విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వడంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీ అద్దాలు దెబ్బతినడంతో దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. జనవరిలో విశాఖపట్నం నగరంలో వందేభారత్ రైలుపై రాళ్లు రువ్విన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని కంచరపాలెం సమీపంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ బోగీ అద్దాలు ధ్వంసమయ్యాయి. కేవలం ఇక్కడే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై ఇలాంటి దాడులు చోటుచేసుకున్నాయి. ఇలాంటి విషయాల గురించి ఇటీవలే భారత రైల్వే శాక సైతం హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పనులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
