FASTag Viral Video: స్మార్ట్ వాచ్ ద్వారా FASTag ను స్కాన్ చేయడం సాధ్యమవుతుందని, ఫాస్ట్‌ట్యాగ్ మోసాలు అంటూ ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన పేటీఎం FASTagను స్కాన్‌ చేయడానికి ప్రత్యేక హార్డ్‌వేర్‌ ఉంటుందనీ, వేరే వ్యక్తులు FASTag ను స్కాన్‌ చేయడం ద్వారా డబ్బులు కొల్లగొట్టలేరని వివ‌ర‌ణ ఇచ్చింది. 

FASTag Viral Video: ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతున్నది. అదే.. FASTag ను స్కాన్‌ చేసి.. ఓ పిల్ల‌వాడు డబ్బు కొట్టేసే ప్ర‌య‌త్నం చేశాడ‌నే అనే వీడియో సోషల్ మీడియా, WhatsApp వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది నిజానిజాలు తెలియ‌కుండా ఈ వీడియోను నమ్మేస్తున్నారు. ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్ల‌డంతో .. ఈ వాద‌న‌ల‌ను తిర‌స్క‌రించారు. ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేయడానికి ప్రత్యేక హార్డ్‌వేర్‌ ఉంటుందనీ, వేరే వ్యక్తులు ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా డబ్బులు కొల్లగొట్టలేరని తేల్చి చెప్పింది.

ఇంత‌కీ ఆ వీడియోలో ఏముంది? 

వైరలవుతున్న‌వీడియోలో.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఓ పిల్లవాడు కారు విండ్‌షీల్డ్‌ను తుడుచుకుంటూ తన స్మార్ట్‌వాచ్‌తో ఫాస్ట్‌ట్యాగ్‌ని స్కాన్ చేస్తూ కనిపించాడు. ఆ స‌మ‌యంలో ఆ పిల్ల‌వాడి చేతికి స్మార్ట్ వాచ్ చూసి.. అనుమానం వ‌చ్చిన కారులోని ప్ర‌యాణికుడు స‌ద‌రు బాలుడ్ని.. ఏం చేస్తున్నావ్.. స్మార్ట్ వాచ్ చూసి.. ఎక్క‌డి ఈ వాచ్.. ఆ వాచ్ తో ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ మీద ఎందుకు ట్యాప్‌ చేస్తున్నావు? అని అడగ్గా.. ఆ బాలుడు భ‌యంతో సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఆ బాలుడిని పట్టుకునేందుకు కారులో ఉన్న వ్య‌క్తి వెంబడిస్తాడు. కానీ ఆ బాలుడ్ని ప‌ట్టుకోలేక‌పోతాడు. ఈ త‌తంగాన్ని వీడియో తీస్తున్న వ్య‌క్తి.. ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద అడుక్కునే పిల్లలకు మోసగాళ్లు.. ఇలాంటి వారు కారు అద్దాలు తుడుస్తూ..స్కానర్‌లతో కూడిన స్మార్ట్‌వాచ్‌లు పెట్టుకుని.. ఫాస్ట్‌ట్యాగ్ నుంచి కొల్లాగొడుతున్నార‌ని ఆరోపించాడు.

స్పందించిన Paytm 

ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుండగా..ఫాస్టాగ్‌ సర్వీసుల్ని అందిస్తున్న Paytm స్పందించింది. ఆ వీడియోలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టి పారేసింది. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ ప్రకారం.. ఫాస్టాగ్‌ చెల్లింపులు చాలా సురక్షితమని అధికారిక ప్రకటన ఇచ్చింది. FASTag లావాదేవీలు పూర్తిగా రిజిస్టర్డ్‌ మర్చంట్‌లు మాత్రమే స్కాన్‌ చేసుకోవచ్చు. ఆ బార్‌ కోడ్‌లు ఎవ‌రు స్కాన్‌ చేయలేవు అంటూ వివరణ ఇచ్చింది.

FASTag అనేది.. 

"FASTag" అనేది ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయగల ట్యాగ్ స‌ర్వీస్. ఇది టోల్‌ల కోసం ఆటోమేటిక్ చెల్లింపు చేయడానికి అనుమతిస్తుంది. కారు విండ్‌షీల్డ్‌పై అమర్చబడిన FASTag ను స్కానర్‌తో కమ్యూనికేట్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతను ఉపయోగిస్తారు. ఆటోమెటిక్ గా వినియోగదారు బ్యాంక్ ఖాతా నుండి న‌గ‌దు డిడ‌క్ట్ అవుతోంది. ప్ర‌తి వీడియోను ఇష్టానుసారంగా షేర్ చేయ‌కుండా నిజానిజాలు తెలుసుకుంటే.. ఇలాంటి వీడియోలు వైర‌ల్ కావ‌ని సాంకేతిక నిపుణులు అంటున్నారు.

Scroll to load tweet…