2018 ఆగస్టు నెల దేశప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.. వారి వారి రంగాల్లో ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించిన పలువురు ప్రముఖులు ఇదే నెలలో కన్నుమూశారు. ఈ నెల మొదట్లో తమిళ రాజకీయ కురువృద్ధుడు కరుణానిధితో మొదలుపెట్టి... ఈ రోజున హరికృష్ణ వరకు ప్రజల చేత జేజేలు అందుకుని.. వారిని శోకసంద్రంలోకి నెట్టారు.

కరుణానిధి: ద్రవిడ ఉద్యమాన్ని నడిపించి.. 50 ఏళ్లపాటు డీఎంకే అధినేతగా.. తమిళనాడుకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు తెచ్చుకున్న కరుణానిధి.. వయసుకు సంబంధించిన అనారోగ్యంతో ఆగస్టు 7న మరణించారు. ఆయన మరణం భారతదేశ రాజకీయాల్లో ఒక శకానికి ముగింపు పలికినట్లయ్యింది. కరుణానిధి మరణాన్ని తట్టుకోలేక  ఎంతోమంది అభిమానుల గుండె ఆగిపోయింది.

వాజ్‌పేయ్:
ఆజాత శత్రువు, మచ్చలేని నేతగా గుర్తింపు పొందిన రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఆగస్టు 16న కన్నుమూశారు. బీజేపీ నుంచి తొలి ప్రధానిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఐదేళ్లపాటు ప్రధానిగా సంచలన నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి బాట పట్టించారు. 

నందమూరి హరికృష్ణ:
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ తనయుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ.. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి నెల్లూరుకు కారులో బయలుదేరిన హరికృష్ణ నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు.

వీరితో పాటు మాజీ లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్, ప్రముఖ జర్నలిస్ట్, మేధావి కుల్‌దీప్ నయ్యర్, భారత మాజీ టెస్ట్ కెప్టెన్ అజిత్ వాడేకర్, బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ అనంత్ బజాజ్ ఆగస్టు నెలలోనే మరణించారు.