గురుగ్రామ్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ: ఇంకా ఆలయంలోనే 2500 మంది, ఇంటర్నెట్ బంద్
గురుగ్రామ్ కు సమీపంలోని నుహ్ లో మతపరమైన ఊరేగింపు సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో సోమవారం నాడు ఓ ఆలయ సమీపంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సుమారు 2500 మంది పురుషులు, మహిళలు, పిల్లలు ఆలయంలోనే ఆశ్రయం పొందారు. ఇరువర్గాల ఘర్షణల నేపథ్యంలో కార్లకు నిప్పు పెట్టారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణను నివారించేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించారు. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. మరో వైపు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. జనం గుంపులుగా ఉండకూడదని పోలీసులు ఆదేశించారు.
గురుగ్రామ్ కు సమీపంలో ఉన్న నుహ్ లో మతపరమైన ఊరేగింపు సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్రను గురుగ్రామ్ -అల్వార్ జాతీయ రహదారిపై కొందరు యువకులు అడ్డుకొని ఊరేగింపుపై రాళ్లు రువ్వారని ప్రత్యర్థి వర్గంపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే హింస తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలపై దాడి చోటు చేసుకుంది.
మతపరమైన ఊరేగింపులో పాల్గొనడానికి వచ్చిన 2500 మంది ప్రజలు నల్హర్ మహాదేవ్ ఆలయంలో తలదాచుకున్నారు. వారి వాహనాలు ఆలయం బయట పార్క్ చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు చేసిన అభ్యంతరకర వీడియోతో ఘర్షణ తలెత్తిందని ప్రచారం సాగుతుంది.
భజరంగ్ దళ్ సభ్యుడు మోను మనేసర్ అతని సహచరులపై క్రిమినల్ కేసులున్నట్టుగా చెబుతున్నారు.కొన్ని రోజుల క్రితం మోను మనేసర్ ఓ వీడియోను విడుదల చేశారు. మేవాత్ ర్యాలీలో పాల్గొంటానని ఆయన సవాల్ చేశారని అంటున్నారు.ఈ యాత్రలో అతనితో పాటు ఆయన సహచరులు పాల్గొన్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఘర్షణ చోటు చేసుకుందని ప్రచారం సాగుతుంది.