కరోనా వైరస్ మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తోంది. ఈ మహమ్మారి ఎక్కడ తమకు అంటుకుంటుందోనని పలువురు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న మహిళా డాక్టర్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత గ్రామస్తులే అడ్డుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంబూరు తాలుకా కృష్ణాపురం గ్రామానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె సుధ (32). ఈమె చెన్నైలోని ఓ ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పనిచేస్తున్నారు.

Also Read:గుడ్‌న్యూస్‌: 'చివరి దశ ప్రయోగాలు, సెప్టెంబర్లో కరోనా వ్యాక్సిన్'

ఈమెకు రాణిపేటకు చెందిన మరో దంత వైద్యుడు సత్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. సుధ, సత్యలు చెన్నైలోని షోళింగనల్లూరులో నివసిస్తూ ఆసుపత్రికి వెళ్లి వచ్చేవారు.

అయితే వీరిద్దరి మధ్య అప్పుడప్పుడూ చిన్న చిన్న ఘర్షణలు జరిగేవి. దీంతో తీవ్ర మనోవేదనకు  గురైన సుధ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read:ఒకే రోజు రికార్డు స్థాయిలో కేసులు: మొత్తం కరోనా కేసులు 2,86,579కి చేరిక

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సుధ మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో సుధ తండ్రి రాజేంద్రన్ ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి తరలించి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు.

అయితే కరోనా వైరస్ నేపథ్యంలో తీవ్ర భయాందోళనలో వున్న గ్రామస్తులు ఆమె అంత్యక్రియలను అడ్డుకునే యత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్మశానానికి చేరుకుని పెద్ద సంఖ్యలో గుమిగూడిని జనాన్ని అక్కడి నుంచి పంపించి, కేవలం 12 మందితో అంత్యక్రియలు  నిర్వహించేందుకు అనుమతించారు.