న్యూఢిల్లీ: కరోనాకు చెక్ పెట్టే వైరస్ మరో మూడు నెలల్లో ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేస్తున్న  వ్యాక్సిన్ లో భాగస్వామిగా ఉన్న అస్ట్రాజెనెకా ఈ విషయాన్ని ప్రకటించింది.

కరోనా వైరస్ నిరోధించేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తోంది. ఈ తయారీతో పాటు వ్యాక్సిన్ మార్కెటింగ్ లో అస్ట్రాజెనెకా సంస్థ భాగస్వామిగా ఉంది.

ఏజడ్‌డీ1222 జేఏబీ అనే వ్యాక్సిన్ తయారీని ప్రారంభించినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన ఆగష్టులో విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో వ్యాక్సిన్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సుమారు 10  కోట్ల డోసుల వ్యాక్సిన్ ను సెప్టెంబర్ మాసంలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తోందని ఆ సంస్థ తేల్చి చెప్పింది.

కరోనాను నిరోధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీకి పరిశోధనలు చేస్తున్నారు. సుమారు 12 సంస్థల పరిశోధనలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన సంస్థల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కూడ ఒకటి. 

also read:ఒకే రోజు రికార్డు స్థాయిలో కేసులు: మొత్తం కరోనా కేసులు 2,86,579కి చేరిక

కరోనాకు చెక్ పెట్టే క్రమంలోనే ఏజడ్‌డీ1222 జేఏబీ అనే వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ తయారీలో భాగంగా ఇప్పటికే 18 నుండి 55 ఏళ్ల మధ్య ఆరోగ్యవంతమైన వలంటీర్లపై ప్రయోగాలు నిర్వహించింది.ఈ ట్రయల్స్ విజయవంతమైనట్టుగా ఆక్స్‌ఫర్డ్ సంస్థ ప్రకటించింది. చివరి దశ ప్రయోగాల కోసం మరో 10,260 మందిని ఎంపిక చేశారు. వారిపై ఈ వ్యాక్సిన్ ఫలితాలు ఇస్తే తమ ప్రయోగం సక్సెస్ అయినట్టేనని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

అస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ నాలుగు దేశాల్లో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయనుంది. బ్రిటన్ , ఇండియా, స్విట్జర్లాండ్, నార్వే దేశాల్లో వ్యాక్సిన్ తయారీ చేయనున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందం కూడ చేసుకొంది. ఇండియాలో ఈ వ్యాక్సిన్ తయారీకి పుణెలోని సీరమ్ సంస్థతో అస్ట్రాజెనెకా ఒప్పందం చేసుకొంది.