చెన్నై: సినీ హీరో విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల సంఘం వద్ద ఆయన పార్టీ పేరును కూడా రిజిష్టర్ చేయించినట్లు చెబుతున్నారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. 

త్వరలోనే విజయ్ పార్టీ వివరాలను కూడా ప్రకటిస్తారని అంటున్నారు. గతంలో ఆయన నివాసంలో ఐటి సోదాలు జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. 

అయితే, విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై అధికారికంగా మాత్రం నిర్ధారణ కావడం లేదు. పైగా విజయ్ పీఆర్వో ఆ వార్తలను ఖండించారు. విజయ్ అధికారిక పీఆర్వో ఆ వార్తలను ఖండించారు. తళపతి విజయ్ రాజకీయ పార్టీని రిజిష్టర్ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని పీఆర్వో రియాజ్ కె. అహ్మద్ స్పష్టం చేశారు. 

 

అయితే, ఈ వ్యవహారంలో మాత్రం ఓ మలుపు ఉంది. ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఐక్కమ్ పేర తాను రాజకీయ పార్టీ రిజిష్టర్ చేయించడానికి దరఖాస్తు పెట్టానని, ఇది తన ప్రారంభమని విజయ్ తండ్రి ఎస్ఎ చంద్రశేఖరన్ ఎన్టీటీవీతో చెప్పారు. ఇది విజయ్ రాజకీయ పార్టీ కాదని ఆయన చెప్పారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తారా, లేదా అనే విషయంపై తాను ఏమీ మాట్లాడబోనని ఆయన చెప్పారు.