మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు వీడియోలు తొలగించాలి.. సోషల్ మీడియాకు కేంద్రం ఆదేశాలు..
మణిపూర్ మహిళలను నగ్నంగా పరేడ్ చేసిన వీడియోను తొలగించాలని ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కేంద్ర ప్రభుత్వం కోరింది.

మణిపూర్ : ఇద్దరు మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోను తీసివేయాలని కేంద్రం ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోరింది. భారతదేశంలో పనిచేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని తెలిపింది. ఈ విషయం దర్యాప్తులో ఉందని తెలిపింది. బిజెపి పాలిత మణిపూర్ నుండి వీడియో వైరల్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలోనే ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఈ మేరకు కోరిందని నమ్ముతారు. ఈ వీడియోపై ప్రతిపక్ష, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమానవీయమైన, దిగ్భ్రాంతికరమైన వీడియోను చూసిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌తో మాట్లాడినట్లు చెప్పారు.
నగ్నంగా ఊరేగించి.. సామూహిక అత్యాచారం.. హత్య..!
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేష్, సచిన్ పైలట్, శివసేన (ఉద్ధవ్) నేతలు ఆదిత్య ఠాక్రే, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ నేతలు మహువా మోయిత్రా, సాకేత్ గోఖలే మణిపూర్‌పై ప్రధాని మోదీ స్పందించి, ప్రకటన చేయాలని కోరుతూ వీడియోను తీవ్రంగా ఖండించారు.
వీడియో వైరల్ అయిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రభుత్వ నిరాశను, హింస, నకిలీ వార్తలను నిరోధించడంలో దాని అసమర్థతను మాత్రమే చూపుతోందన్నారు.
మే 4న, మణిపూర్‌లో కుకీ-మీతేయి ఘర్షణ ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత, కుకీ మహిళలను దుస్తులు విప్పి, ఆపై నగ్నంగా ఊరేగించారు. బట్టలు విప్పకుంటే చంపేస్తామని బెదిరించారు. ఇద్దరు మహిళలు నగ్నంగా నడుస్తున్న వీడియో బుధవారం వెలుగు చూసింది. ఘటన జరిగిన రెండున్నర నెలల తర్వాత మళ్లీ పోస్ట్ చేశారు. గుర్తుతెలియని దుండగులపై నెల రోజుల క్రితం ఫిర్యాదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఘటన మీద దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడుని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మణిపూర్ ఘటనకు సంబంధించిన వీడియో చూసి.. తీవ్ర ఆవేదన చెందాను. నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను. వారికి పడే శిక్ష చూసి మరొకరు ఇలాంటి పనులు చేయడానికి కూడా భయపడేలా ఉండాలి’ అని ట్వీట్ చేశారు.