ఓ తెల్ల సింహం పిల్ల తల్లితో సయ్యాటలాడే వీడియో ఇప్పుడు నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

ఢిల్లీ : ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా అడవి జంతువులకు సంబంధించిన అనేక వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు మరొకటి షేర్ చేశారు. అదిప్పుడు నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అడవిలో స్వేచ్ఛగా తిరిగే, పులులు, సింహాలు వాటి కోపమే కాదు.. సయ్యాటలూ బాగుంటాయి. అలాంటి ఓ సరదా వీడియో ఇది.

ఓ సింహం తన పిల్లలతో అడవిలో వెడుతోంది. అందులో ఓ తెల్ల సింహం పిల్ల ఉండడం.. అది తల్లితో మిగతా పిల్లలతో ఆటలాడడం ఆ వీడియోలో ఉంది. అది చూసిన వారందరినీ అబ్బుర పరుస్తోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. తరచుగా వన్యప్రాణుల వీడియోలను షేర్ చేసే ఐఎఫ్ఎస్ అధికారి గురువారం ఉదయం ఒక తెల్ల సింహం పిల్ల తన కుటుంబంతో కలిసి అడవిలో విహరిస్తూ, షికారు చేస్తున్న చిన్న క్లిప్‌ను పంచుకున్నారు.

‘మీ కోసం ఈ సారి ఓ తెల్ల సింహం పిల్ల వీడియోను తీసుకొచ్చా.. ప్రపంచంలో కేవలం మూడు తెల్ల సింహాలు మాత్రమే అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయని అంచనా’ అంటూ ఆ క్లిప్ కి క్యాప్షన్ ఇచ్చారు. ఆ సింహం దాని పిల్లలతో తన రాజ్యమైన అడవిలో గంభీరంగా నడుస్తూ, పొదలు, రాళ్లతో కూడిన అటవీ మార్గంలో తన పిల్లలకు దారి చూపుతూ.. వెడుతుంటే.. సింహం పిల్లలు.. తల్లి చుట్టూ గారాలు పోతూ.. బుడి బుడి అడుగులతో అల్లరి చేస్తూ ఫాలో అవుతున్నాయి. 

పబ్లిక్ టాయిలెట్‌ వాడుకుని డబ్బులివ్వలేదని ఒకరి హత్య.. ముంబైలో దారుణం..

ఈ సింహం పిల్లలో ఒకటి అరుదైన తెల్లజాతి సింహం పిల్ల ఉండడం ఆసక్తి కరంగా మారింది. ఆ సింహం పిల్ల తన తోబుట్టువులతో సరదాగా పరిగెత్తుకుంటూ, ఆడుకుంటూ తల్లిని అనుసరిస్తుంది. మధ్య మధ్యలో ఆ సింహం ఒక్కసారి ఆగి.. అన్ని పిల్లలూ వచ్చాయా, లేదా అని ఒకసారి వెనక్కి తిరిగి చూసి.. తరువాత ముందుకు కదులుతుంది. ఈ వీడియో ఇప్పటివరకు 16,000 కంటే ఎక్కువ వ్యూస్ ను, 1200 లైక్‌లను సాధించింది.

నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్ల వరదను పారించారు. ఒకరు మాట్లాడుతూ.. ''అద్భుతంగా ఉంది. ఇండియాలో ఇలాంటి ఫారెస్ట్ అధికారి ఉండడం మాకు గర్వకారణం. వీటిని రక్షిస్తున్నందుకు అటవీ శాఖను అభినందిస్తున్నాను. అయితే ఈ వీడియో భారత్ కే చెందింది అయితే దయచేసి లొకేషన్ చెప్పకండి’ అన్నారు. సింహం పిల్లలు సురక్షితంగా, సంతోషంగా ఉండాలని ఒకరు ఆశిస్తే, మరొకరు ముద్దుగా ఉన్నాయంటూ సంబరపడ్డారు. 

గ్లోబల్ వైట్ లయన్ ప్రొటెక్షన్ ట్రస్ట్ ప్రకారం, తెల్ల సింహాలు,పులులు రెండూ చాలా అరుదుగా ఉంటాయి. అవి అంతరించి పోతున్న జాతికి చెందినవి. దక్షిణాఫ్రికాలో, ముఖ్యంగా గ్రేటర్ టింబవతి, దక్షిణ క్రుగర్ పార్క్ ప్రాంతంలో తెల్ల సింహాలు కనిపిస్తాయి.

Scroll to load tweet…