కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలో భజరంగ్‌దళ్‌ను ప్రస్తావిస్తూ తమ పరువు తీశారని వీహెచ్‌పీ-బజరంగ్ దళ్ చండీగఢ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రూ.100.10 కోట్ల పరువునష్టం కింద లీగల్ నోటీసు పంపింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు వీహెచ్‌పీ చండీగఢ్ యూనిట్, దాని విభజన విభాగం బజరంగ్ దళ్‌లు లీగల్ నోటీసులు పంపాయి. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో‌లో బజరంగ్ దళ్‌పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని.. ఇందుకుగాను రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని విహెచ్‌పీ ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి కాంగ్రెస్‌కు పంపిన ప్రశ్నలపై ఆ పార్టీ నుంచి స్పందన లేదు. 

మే 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే బజరంగద్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి వ్యక్తులు, సంస్థలను కట్టడి చేస్తామని హామీ ఇచ్చింది. అటువంటి సంస్థలపై అవసరమైతే ‘‘నిషేధం’’ విధిస్తామని హామీ ఇచ్చింది. 

దీనిపై వీహెచ్‌పీ మండిపడింది. ఈ సందర్భంగా ఖర్గేకు పంపిన లీగల్ నోటీసుల్లో వీహెచ్‌పీ తరపు న్యాయవాది, దాని లీగల్ సెల్ కో హెడ్ సాహిల్ బన్సాల్ పలు అభియోగాలు మోపారు. మేనిఫెస్టో 10వ పేజీలో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌పై పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని.. తమ సంస్థను నిషేధిస్తామని ప్రకటించడంతో పాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా , స్టూడెంట్స్ ఇస్లామిక్ వంటి ఉగ్రవాద సంస్థలతో పోల్చారని న్యాయవాది పేర్కొన్నారు. 

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా , సిమి, ఆల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్‌లను ఉగ్రవాద సంస్థలుగా ఐక్యరాజ్యసమితితో పాటు 100కు పైగా దేశాలు నిషేధించాయని ఆయన గుర్తుచేశారు. బజరంగ్ దళ్ సార్వత్రికత, సహనం, ధార్మిక ఐక్యత, జాతీయ సమగ్రత, భరత మాత సేవకు అంకితమైందని.. ఆదర్శ పురుషులైన శ్రీరాముడు, హనుమంతుని నుంచి తాము స్పూర్తిని పొందినట్లు బన్సాల్ తెలిపారు. బజరంగ్ దళ్ పూర్తిగా ధర్మసేవకు అంకితం చేయబడిందని అలాంటి సంస్థపై చేసిన అభియోగాలు నిరాధారమైనవి, అభిశంసించలేనివని లాయర్ పేర్కొన్నారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చేసిన పరువు నష్టం కలిగించే ప్రకటన, ఆ తర్వాత దానిని ప్రజల్లోకి విడుదల చేయడం వల్ల తన క్లయింట్ ప్రతిష్ట, గౌరవం దెబ్బతినడంతో నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారని లాయర్ చెప్పారు. నోటీసు అందిన 14 రోజుల్లోగా వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌లకు రూ.100.10 కోట్లు చెల్లించాలని ఖర్గేను నోటీసుల్లో కోరారు.

Scroll to load tweet…