రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతున్నది. అందులో తొలి ప్రేమ అంటూ రాఘవ్ చద్దాను వెంకయ్యనాయుడు టీజ్ చేశారు.
న్యూఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వారి ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు కూడా బయట వైరల్ అయ్యాయి. ఈ జంట ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో ఎంతో అన్యోన్యంగా మెలగడం చాలా మందిని ఆకర్షించింది. వీరి పెళ్లి విషయం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారగా.. మరో వీడియో తెగ వైరల్ అవుతున్నది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు రాఘవ్ చద్దాను ప్రేమ విషయమై టీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
ఆ వీడియోలో ఆప్ నేత రాఘవ్ చద్దా ఏదో అంశాన్నీ సీరియస్‌గా చెబుతున్నారు. ఆయన కొంత గ్యాప్ ఇవ్వగానే వెంకయ్య నాయుడు ఓ జోక్ పేల్చారు. రాఘవ్ చద్దాను టీజ్ చేశారు. ‘రాఘవ్.. నాకు తెలిసి ప్రేమ ఒకే సారి పుడుతుంది. అంతేకదా! ఒకసారి, రెండోసారి, మళ్లీ ఓసారి.. ఇలా ప్రేమ పుడుతుందా? తొలి ప్రేమనే ఉంటుంది’ అని వెంకయ్య నాయుడు అన్నారు.
వెంకయ్య నాయుడు కామెంట్లతో సభ ఘొల్లుమన్నది. అంతా నవ్వారు. రాఘవ్ చద్దా కూడా నవ్వారు. నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. ‘నాకు ఆ అనుభవం లేదు. సార్.. ఇప్పటికైతే నా జీవితంలో ఆ అనుభవం లేదు. కానీ, తొలి ప్రేమ మంచిగా ఉంటుందని అనుకుంటున్నా..’ అని రాఘవ్ అన్నారు.
దీనికి వెంకయ్య నాయుడు సమాధానం ఇస్తూ.. ‘తొలి ప్రేమ మంచిగా ఉంటుంది. అదే ఎప్పటికీ ఉండిపోవాలి. జీవితంతాం..’ అని వెంకయ్య నాయుడు అన్నారు.
రాఘవ్ చద్దా ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
