ఉత్తరప్రదేశ్‌లో ఓ దొంగ చోరీ కోసం వెళ్లి ఇంటిలోనే కనిపించిన కాస్ట్లీ మందు తాగి మత్తులోకి జారుకున్నాడు. ఆ ఇంటి బెడ్ రూమ్‌లోనే కంఫర్ట్‌గా నిద్రపోయాడు. కళ్లు తెరిచి చూస్తే ఇంటి యజమాని కుటుంబం కనిపించింది. షాక్ అయిన ఆ దొంగ పారిపోయే ప్రయత్నం చేయగా.. బంధించి పోలీసులకు అప్పగించారు. దొంగ ఇంట్లోనే ఉన్నా విలువైన వస్తువులు, నగదు చోరీకి గురయ్యాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ దొంగ చోరీ చేయడానికి పెద్దింటిలోకి వెళ్లాడు. ఆర్మీ రిటైర్డ్ అధికారి ఇల్లు. ఇంటిలోపలికి వెళ్లగానే కాస్టలీ మందు బాటిల్స్ కనిపించాయి. వాటిని చూడగానే తాను నియంత్రణ కోల్పోయాడు. ఆ మందును ఫుల్‌గా తాగి బెడ్ రూమ్‌లో ఒళ్లు మరిచి పడుకున్నాడు. ఆ ఇంటి యజమాని కుటుంబం వచ్చినా నిద్ర లేవలేదు. కొన్ని గంటలు వెయిట్ చేసిన తర్వాత కళ్లు తెరవగానే ఎందురుగా ఇంటి యజమాని కుటుంబ సభ్యులు ఉన్నారు. పారిపోయే ప్రయత్నం చేయగానే.. బంధించి పోలీసులకు అప్పగించారు. ఇదంతా ఒక వైపు.. దొంగ ఇంటిలోనే తప్పతాగి పడుకున్నా.. ఇంటిలోని విలువైన వస్తువులు మాయమైపోయాయి.
బిహార్‌లోని ఛాప్రాకు చెందిన శర్వానంద్ రిటైర్డ్ ఆర్మీ అధికారి. యూపీ రాజధాని లక్నోలో కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ ఏరియాలో శర్వానంద్ కుటుంబం నివాసముంటున్నది. ఆ రోజు శర్వానంద్ కుటుంబం బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లింది. అదే రోజు ఇంట్లో చోరీ జరిగింది. 100 గ్రాముల బంగారం, రూ. 1.5 లక్షల విలువైన రెండు కిలోల వెండి, రూ. 50 వేల విలువైన 40 ఖరీదైన చీరలు, మరికొన్ని విలువైన డాక్యుమెంట్లు సహా రూ. 6 లక్షలు చోరీకి గురయ్యాయి.
Also Read: దేశ రాజధాని ఢిల్లీలో రెడీ అయిన కొత్త పార్లమెంట్ భవనం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఆరోజేనా..?
పెళ్లి వేడుక నుంచి ఇంటికి రాగానే.. గేటు పైన కొంచెం డ్యామేజీని వారు గుర్తించారు. ఇంటిలోకి వెళ్లగానే వస్తువులను విసిరేసి చెల్లాచెదురుగా కనిపించాయి. ఇల్లంతా అలాగే చూస్తూ వెళ్లగా బెడ్ రూమ్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్నట్టు చూశారు. ఆ యువకుడు స్వయంగా మేలుకునే వరకు ఎవరూ అతని లేపలేదు. మద్యం మత్తులో నుంచి దొంగ లేవగానే కుటుంబ సభ్యులు పట్టుకుని బంధించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆయనను విచారించగా కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. తన పేరు సలీం అని, శారదా నగర్ నివాసి అని తెలిసింది. ఆ దొంగతనానికి పట్టుబడ్డ దొంగ సలీం తోపాటు మరికొందరు వచ్చారు. వారంతా ఇంట్లోకి దూరారు.
తన సహచరులతోపాటు ఇంటిలోకి వచ్చానని సలీం చెప్పాడు. ఇల్లు మొత్తం వెతికారని వివరించాడు. అయితే.. తనతో వచ్చిన వారు తనకు ఫుల్‌గా తాగించారని చెప్పాడు. ఆ తర్వాత సలీం వద్ద నుంచి ఆభరణాలను దొంగిలించి పారిపోయాడు. ఇప్పుడు పోలీసులు సలీం తోపాటు వచ్చిన వారి గురించి గాలిస్తున్నారు.
