భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌కు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో రూపొందించిన ప్రాజెక్టే గగన్‌యాన్.

ఇందుకోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి నలుగురు పైలట్లను ఎంపిక చేసినట్లు ఇస్రో తెలిపింది. వీరికి జనవరి మూబో వారం నుంచి రష్యాలో శిక్షణ మొదలుకానుంది.  అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల కోసం ఇస్రో ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేసింది.

Also Read:కొత్త ఏడాదిలో భారి కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగించనున్న ఇండియా

ఇందుకోసం మైసూరులోని డిఫెర్స్ ఫుడ్ రీసెర్చ్ లేబోరేటరి ప్రత్యేకంగా మెనూ తయారు చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో పనిచేసే ఈ ల్యాబ్... రోదసీలోకి వెళ్లే వ్యోమగాముల కోసం దాదాపు 30 రకాల వంటకాలను తయారు చేసింది.

ఇందులో ఇడ్లీ-సాంబార్, వెజ్ పులావ్, ఉప్మా, హల్వా, వెజ్ రోల్స్, ఎగ్ రోల్స్ తదితర వంటకాలున్నాయి. అంతేకాకుండా ఆహార పదార్థాలను వేడి చేసుకోవడం కోసం ప్రత్యేకమైన ఫుడ్ హీటర్స్‌ను కూడా వాహకనౌకలో పంపిస్తున్నారు.

అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కనుక.. వ్యోమగాములు నీరు, జ్యూస్ లాంటి ద్రవ పదార్థాలను తీసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన కంటెయినర్లను కూడా లేబోరేటరీ తయారు చేసింది.

Also Read:చంద్రయాన్-3కి కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. పని మొదలైంది: ఇస్రో చీఫ్ శివన్

గగన్‌యాన్ ప్రాజెక్ట్ విలువ సుమారు రూ.10 వేల కోట్లు. ఇందుకు సంబంధించి ఇస్రో 2007లోనే పని మొదలు పెట్టింది. అన్నీ అనుకూలిస్తే 2021 డిసెంబర్‌లోగా ఈ ప్రయోగాన్ని పూర్తి చేస్తామని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్ ప్రకటించారు. భారతదేశంలో అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినంత వరకు వ్యోమగాముల ఎంపిక ప్రక్రియను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరో స్పేస్‌ మెడిసిన్ నిర్వహిస్తోంది.