కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల పోలీసులను ఒకప్పుడు గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్‌కు భారతీయ జనతా పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది.

తమిళనాడు యువ మోర్చా విభాగం అధ్యక్షురాలిగా ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్య... గత ఫిబ్రవరిలో తన అనుచరులతో కలిసి బీజీపీలో చేరిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరప్పన్ వర్గాన్ని తమవైపుకు తిప్పుకోవాలని బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.

దీనిలో భాగంగానే విద్యకు పదవిని కట్టబెట్టారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న వీరప్పన్ వర్గం మొత్తాన్ని బీజేపీ వైపుకు తిప్పేలా విద్య కీలకంగా వ్యవహరిస్తున్నారు.

2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విద్య తన తల్లి ముత్తులక్ష్మీ సంరక్షణలో పెరిగారు. ఉన్నత విద్యను అభ్యసించిన విద్యా వీరప్పన్ రాజకీయాల వైపు నడిచారు.