పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ వెర్షన్.. ఎప్పటి నుంచి అంటే ?
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ వెర్షన్ త్వరలోనే అందుబాటులో రానుందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా చెప్పారు. ఇందులో 22 కోచ్ లు, ఒక లోకోమోటివ్ ఉంటుదని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వెర్షన్ ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని వెల్లడించారు.
ప్రయాణికుల నుంచి ఎంతో ఆదరణను పొందుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ వెర్షన్ అందుబాటులో రానుంది. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్ల వెర్షన్లన్నీ చైర్ కార్లే. ఈ రైలు మిగితా రైళ్లతో పోలిస్తే చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అలాగే సౌకర్యమైంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. గత కొన్ని నెలలుగా కొన్ని రూట్లలో ప్రధాని నరేంద్ర మోడీ వీటిని ప్రారంభించారు. ఈ రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించాయి.
అయితే ఈ రైళ్ల వల్ల ప్రయాణ సమయం తగ్గినప్పటికీ.. ఇందులో స్లీపర్ వెర్షన్లు పెట్టాలని ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రైల్వేలు ఈ విషయంలో సానుకూలంగానే స్పందించినప్పటికీ.. ఎప్పుడు అవి అందుబాటులోకి వస్తాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు దొరికింది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ వెర్షన్ ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయనున్నట్లు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా మీడియాతో తెలిపారు. అయితే ఈ స్లీపర్ రైళ్లలో ఎయిర్ కండిషన్ ఉండదని, పుష్-పుల్ రైళ్లుగా ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో 22 కోచ్ లు, ఒక లోకోమోటివ్ కలిగి ఉంటాయని తెలిపారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు స్లీపర్ వెర్షన్ లు ఎప్పుడు ప్రారంభమవుతాయని మీడియా అడిగిన ప్రశ్నకు బీజీ మాల్యా సమాధానమిస్తూ.. అక్టోబర్ 31న లేదా అంతకంటే ముందే వీటి ప్రారంభం జరగొచ్చని తెలిపారు. ‘‘వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ వెర్షన్ ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో వందే మెట్రోను కూడా ప్రారంభిస్తాం. నాన్ ఏసీ పుష్ పుల్ ట్రైన్ గా పిలిచే ఈ రైలులో 22 బోగీలు, లోకోమోటివ్ ఉంటాయి. అక్టోబర్ 31 లోపు ఆ లాంచ్ జరగబోతోంది.’’ అని తెలిపారు.
కాగా.. ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తుతం కొత్త రకం వందే భారత్ రైలుపై పనిచేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో 12 బోగీలు ఉంటాయని, తక్కువ దూరం ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లోని నీముచ్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ మార్గంలో వందేభారత్ నడపాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.