Asianet News TeluguAsianet News Telugu

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు యాక్సిడెంట్! గేదెలను ఢీకొనడంతో ముందటి భాగం డ్యామేజీ.. నాలుగు గేదెల మృత్యువాత

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వాట్వా స్టేషన్ దగ్గర గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నాలుగు గేదెలు మృత్యువాత పడ్డాయి. కాగా, ఆ ట్రైన్ ముందు భాగం డ్యామేజీ అయింది.
 

vande bharat express accident four buffaloes died
Author
First Published Oct 6, 2022, 4:29 PM IST

అహ్మదాబాద్: ఇటీవలే ప్రారంభించిన గాంధీనగర్ - ముంబయి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్‌కు గురైంది. గుజరాత్‌లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. వాట్వా రైల్వే స్టేషన్‌ దగ్గర వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. పశువులను ఢీకొట్టింది.

రైల్వే అధికారుల ప్రకారం, ఈ ఘటన ఉదయం 11.15 గంటలకు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ముందు భాగాన డ్యామేజీ అయింది. ‘వాట్వా స్టేషన్ దగ్గర ఒక మూలమలుపు ఉన్నది. ఈ కారణంగా ఎదురుగా ఉన్నది కనిపించలేదు. అప్పుడు ట్రైన్ సుమారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. అప్పుడే గేదెలు ట్రాక్ పైకి వచ్చాయి. ఆ గేదెలను ట్రైన్ ఢీకొట్టింది. ఫలితంగా ట్రైన్ ముందు భాగం డ్యామేజీ అయింది’ అని ఓ రైల్వే అధికారి వివరించారు.

అయితే, ట్రైన్‌లో ఫంక్షనల్‌కు సంబంధించిన ఏ భాగమూ డ్యామేజీ కాలేదని ఆ అధికారి తెలిపారు. అంటే.. ఆ ట్రైన్ ముందు ప్లాస్టిక్ అండ్ ఫైబర్ పార్ట్ మాత్రం డ్యామేజీ అయింది. ‘ఆ ట్రైన్ ముందు నుంచి గేదెల కళేబరాలను తొలగించాం. గాంధీనగర్‌కు ఆ ట్రైన్ సకాలంలో చేరుకుంది. గైరట్‌పూర్ - వాట్వా స్టేషన్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. పశువులను ట్రాక్ వైపు విడిచి పెట్టకూడదని సమీప గ్రామస్తుల్లో అవగాహన పెంచడానికి రైల్వే ప్రయత్నిస్తున్నది’ అని రైల్వే ప్రతినిధి తెలిపారు.

సెప్టెంబర్ 30వ తేదీన గాంధీనగర్ - ముంబయి దారిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గాంధీనగర్ స్టేషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios