గుజరాత్ లో రూ.500 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
Vadodara: గుజరాత్ లోని వడోదర సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో రూ.500 కోట్ల విలువైన డ్రగ్స్ ను ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలను చట్టబద్ధంగా తయారు చేసే ముసుగులో నిందితులు నిషేధిత ఎండీ ఔషధమైన మత్తుమందును తయారు చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని సంబంధిత అధికారులు తెలిపారు.

Gujarat Anti-Terrorist Squad: గుజరాత్ లో మరోసారి భారీగా డ్రగ్స్ ను ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు వడోదర నగర శివార్లలోని ఒక రసాయనాల తయారీ యూనిట్ పై దాడి చేశారు. ఈ క్రమంలోనే అక్కడ అక్రమంగా తయారు చేస్తున్న మత్తుపదర్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల విలువైన నిషేధిత ఎండీ ఔషధాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు.
వడోదర సమీపంలోని చిన్న ఫ్యాక్టరీ కమ్ గోడౌన్లో మంగళవారం రాత్రి దాడి చేసిన సమయంలో, సంఘటనా స్థలం నుండి ఐదుగురిని కూడా ఎటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రసాయనాలను చట్టబద్ధంగా తయారు చేసే ముసుగులో నిందితులు ఎండి ఔషధమైన మత్తుమందును తయారు చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. అయితే, దీనవెనుక ఉన్న మొత్తం నెట్ వర్క్ ను చేధించడానికి ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
కాగా, గుజరాత్ లో వరుసగా డ్రగ్స్ పట్టుబడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. డ్రగ్స్ నివారణ చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో వడోదర నగరానికి సమీపంలోని గోదాము నుండి దాదాపు 1,000 కోట్ల రూపాయల విలువైన 200 కిలోలకు పైగా పార్టీ డ్రగ్ మెఫెడ్రోన్ కూడా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.