ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె తనకు, తన భర్తకు తండ్రి నుంచి ప్రాణహానీ ఉందంటూ చేసిన వీడియో మేసేజ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఆమె భయపడ్డట్టుగానే కొందరు సాయుధ వ్యక్తులు ఈ జంటను కిడ్నాప్ చేసినట్లుగా కథనాలు ప్రసారమవుతున్నాయి.

తమకు భద్రత కల్పించాల్సిందిగా సాక్షి మిశ్రా భర్త అజితేష్ కుమార్ కలిసి విచారణకు హాజరయ్యేందుకు సోమవారం అలహాబాద్ హైకోర్టుకు చేరుకున్నారు. వీరు గేట్ నెంబర్ 3 వద్ద వేచి ఉండగానే నల్లరంగు ఎస్‌యూవీలో వచ్చిన కొంతమంది సాయుధులు వీరికి తుపాకీ గురిపెట్టి మరీ అపహరించుకుపోయారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు దర్యాప్తు ప్రారంభించారు. యూపీ80 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న  కారులో.. ఛైర్మన్ రాసి వుందని.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈ దంపతులు ప్రస్తుతం ఎక్కడున్నదీ తమ వద్ద సమాచారం లేదని.. ఆచూకీ గురించి తెలియజేస్తే, వారికి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. తన తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకున్నందుకు గాను తమకు ప్రాణహానీ ఉందని సాక్షి మిశ్రా కొద్దిరోజుల కిందట సోషల్ మీడియాలో వీడియో పెట్టిన సంగతి తెలిసిందే.