ఉత్తరాఖండ్ లోని ఓ స్కూల్లో పిల్లలు వింతగా ప్రవర్తించారు. అరుపులు, కేకలతో టీచర్లకు దడ పుట్టించారు. మాస్ హిస్టీరియా వచ్చినట్టుగా వణికిపోయారు.
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్లో ఒక వింత ఘటన జరిగింది. ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థినులు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా స్కూల్లోనే కొందరు బాలికలు గట్టిగా ఏడవడం వింతగా అరవడం, నేలపై పడి దొర్లడం, గోడకు తల బాదుకోవడం, అరుస్తూ మాట్లాడడం.. వంటి చర్యలకు పాల్పడ్డారు. సడెన్ గా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న ఉపాధ్యాయులు, తోటి పిల్లలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ ఘటన గత మంగళ, గురువారాల్లో భాగేశ్వర్ పరిధిలోని రైఖులి అనే గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విమలాదేవి వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం…
గత మంగళ, గురు గురువారాల్లో పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు స్కూల్లో విచిత్రంగా ప్రవర్తించారు. గట్టిగా ఏడుస్తూ, అరుస్తూ, నేలపై దొర్లుతూ, తల బాదుకుంటూ, వణికిపోతూ కనిపించారు. అది చూసి ఏమయిందోనని కంగారుపడ్డ టీచర్లు పిల్లల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, వారు టీచర్ల మాటలు వినిపించుకునే స్థితిలో లేకపోవడంతో సాధ్యం కాలేదు. దీంతో పిల్లల పరిస్థితిపై వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే, తర్వాత కాసేపటికి ఈ పరిస్థితి దానంతట అదే సద్దుమణిగింది. ఈ ఘటనపై ప్రిన్సిపల్ వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
కట్టెల కోసం వెడితే వజ్రం దొరికింది.. మహిళను వరించిన అదృష్టం...
దీంతో అధికారులు కొందరు వైద్యులు, మానసిక నిపుణులను పాఠశాలకు పంపించారు. వారు వచ్చిన సమయంలో కూడా పిల్లలు ఇలాగే ప్రవర్తించారు. తర్వాత పిల్లలకు రకరకాల పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించారు. సాధారణంగా ఇలా ఒకేసారి ఎక్కువమంది ఇలా వింతగా, విచిత్రంగా ప్రవర్తించడాన్ని మాస్ హిస్టీరియా అంటారు. అయితే, పిల్లలు ఇలా చేయడానికి కారణాలేంటి అని.. వారిని అనేకరకాలుగా పరీక్షించారు వైద్యులు. చివరికి ఇటీవలి వరదల్లో తమ స్నేహితురాలు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినట్లు.. దానివల్లే ఇలా చేశారేమో అని, అది కూడా ఈ ప్రవర్తన కు ఒక కారణం అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని.. కొంతమంది కంటి సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ఇలాంటి ఘటనలే ఇటీవలి కాలంలో అక్కడి మరికొన్ని ప్రభుత్వ స్కూల్లో కూడా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపై నిపుణుల పరిశీలన కొనసాగుతోంది. ఈ సమయంలో స్కూల్ లోని కొందరు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయడంతో.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
