తనను ట్రాన్స్‌ఫర్ చేయించమని కోరిన మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేయించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌. వివరాల్లోకి వెళితే.. ఉత్తరకాశి జిల్లా నౌగావ్‌ ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పనిచేస్తోన్న ఉత్తర బహుగుణ భర్త మూడేళ్ల క్రితం మరణించాడు. 25 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేసి అతి త్వరలో పదవి విరమణ చేస్తుండటంతో.. ఈ కొద్దికాలం పిల్లలకు దగ్గరగా ఉన్న ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయితే బాగుంటుందని భావించింది.

ఇందుకు ముఖ్యమంత్రి నిర్వహించే జనతా దర్బార్‌ వేదికే సరైనదని భావించి అక్కడికి చేరుకుంది.. కార్యక్రమంలో ప్రజల సమస్యలను వింటున్న సీఎం రావత్ ఈమె దగ్గరికి వచ్చి సమస్య ఏంటని అడిగారు.. తన గోడు వెళ్లబోసుకున్న ఉత్తర ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా కోరింది. అయితే దీనిని ముఖ్యమంత్రి తిరస్కరించారు. దీంతో అంత మంది జనం, అధికారులు, భద్రతా సిబ్బంది, ఇతర నేతలు ఉండగానే ఏకంగా సీఎంతో వాగ్వివాదానికి దిగింది..

అక్కడితో ఆగకుండా రావత్‌కు వేలు చూపిస్తూ అసభ్యకర పదజాలంతో దూషించింది. ఊహించని ఈ సంఘటనతో సహనం కోల్పోయిన త్రివేంద్రసింగ్ ఆమెను బయటకు తీసుకెళ్లాల్సిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అప్పటికీ ఉత్తర అలాగే ప్రవర్తనించడంతో.. బిగ్గరగా కేకలు వేయడంతో ఆమెను అరెస్ట్ చేయించడంతో పాటు సస్పెండ్ చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు..

ముఖ్యమంత్రి విధులకు ఆటంకం కలిగించిందనే నేరం కింద ఆమెను అదుపులోకి తీసుకున్నారు.. సీఎం ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ విద్యాశాఖ అధికారులు ఉత్తరను  విధుల నుంచి తప్పించారు. జనతా దర్బార్‌కు వచ్చిన ఎవరో వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది.