ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 25 మంది చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

ఉత్త‌రాఖండ్ లో చోటు చేసుకున్న బ‌స్సు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరిగింది. తొలుత 22 మంది చ‌నిపోయార‌ని అధికారులు తెలిపినా.. త‌రువాత ఆ సంఖ్య 25కి చేరింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్య‌క్తం చేశారు. బాధితులకు ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. మృతుల కుటుంబాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం త‌రుఫున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. 

ఫుడ్ డెలివ‌రీ బాయ్ ను చెంప‌దెబ్బలు కొట్టిన కానిస్టేబుల్.. స‌స్పెండ్ చేసిన అధికారులు..

మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాకు చెందిన 28 మంది ఓ బ‌స్సులో చార్ ధామ్ యాత్ర కు బ‌య‌లుదేరారు. అయితే ఆదివారం సాయంత్రం స‌మ‌యంలో ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా దమ్తా సమీపంలో లోయలో ఈ బ‌స్సు ప్ర‌మాద‌వ‌శాత్తూ ప‌డిపోయింది. దమ్తా ప్రాంతం డెహ్రాడూన్, ఉత్త‌ర‌కాశీ మ‌ధ్య‌న ఉంది, యాత్రికుల‌తో కూడిన బ‌స్సు ఇక్క‌డి నుంచి య‌మునోత్రికి చేరాల్సి ఉంది. అయితే ఈలోపే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ‘‘ ఈ రోజు చాలా విషాదకరమైన సంఘటన జరిగింది. 25 మంది చనిపోయారు. మేము అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నాం. డీఎం, ఎస్పీ ఇద్దరినీ సంఘటనా స్థలానికి పంపించాం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపింది’’ అని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. 

Scroll to load tweet…

కాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గ సహచరుడు బిజేంద్ర ప్రతాప్ సింగ్ డెహ్రాడూన్ బయలుదేరాడని తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు అక్కడి నుంచి సోమ‌వారం హెలికాప్టర్ లో ఉత్త‌ర‌కాశీకి వెళ‌తార‌ని చెప్పారు. అలాగే త‌మ ప్ర‌భుత్వ బృందం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు బయలుదేరిందని, బాధితుల బంధువుల‌కు మృత‌దేహాల‌ను అందించ‌డానికి, అలాగే సహాయక చర్యలు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి, బాధితుల‌కు ట్రీట్ మెంట్ అందించ‌డానికి ఈ బృందం ఏర్పాట్లు చేస్తుంద‌ని చెప్పారు. 

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున సీఎం ప్ర‌క‌టించారు. కాగా ఈ ప్రమాదం బాధాక‌ర‌మైన‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సంతాపం వ్య‌క్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడి విచారం వ్యక్తం చేశారు. లోక‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమగ్నమయ్యాయని అమిత్ షా ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

రోడ్డు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు రావడం బాధాకరమని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. ‘‘ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ అపారమైన నష్టాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలి. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం సహాయ, సహాయక చర్యల్లో చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నాయి ’’ అని ఆయ‌న పేర్కొన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ ఘ‌ట‌న ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు. ‘‘ చార్ ధామ్ యాత్రలో పలువురు యాత్రికులు యమునోత్రి హైవేపై ఉత్తరకాశిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల బంధువులకు నా సంతాపాన్ని, ప్రాణాలతో బయటపడిన వారికి సంఘీభావం తెలియజేస్తున్నాను ’’ అని పేర్కొన్నారు