Asianet News TeluguAsianet News Telugu

జాతీయ జెండా ఎగరేయని ఇంటి ఫొటోలు తీయండి: బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. వివరణలో ఏమన్నారంటే?

జాతీయ జెండా ఎగరేయని ఇంటి ఫొటోలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు సాధారణ ప్రజలకు వర్తించవని, కేవలం బీజేపీ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తాయని వివరించారు. ప్రధాని పిలుపును పార్టీ కార్యకర్తలు అందరూ పాటించాలనేది తమ అభిలాష అని చెప్పారు.
 

uttarakhand bjp chief mahendra bhatt says take photos of houses without national flag.. explains after
Author
New Delhi, First Published Aug 12, 2022, 2:49 PM IST

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ రోజు ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌కు పిలుపు ఇచ్చింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి కుటుంబం తమ ఇంటిలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలని బీజేపీ ఈ క్యాంపెయిన్‌ను విస్తృతం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును అందరూ ఆచరించాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అన్నారు. అంతటితో ఆగకుండా జాతీయ జెండా ఎగరేయని ఇళ్ల ఫొటోలు తీయాలని పిలుపు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు మండిపడ్డాయి.

ఈ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ ఈ రోజు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు అందరికీ వర్తించవని, కేవలం బీజేపీ వర్కర్లకు మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. తన వ్యాఖ్యలు సాధారణ ప్రజలకు వర్తించవని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును పార్టీ కార్యకర్తలు అందరూ పాటించాలనేదే తన అభిలాష అని, అది కనుక్కోవడానికి వారు ఒక వేళ జాతీయ జెండా ఎగరేయకుంటే వారి ఇంటి ఫొటో తీయాలని కోరానని వివరణ ఇచ్చారు. అదే విధంగా తాను కొన్ని వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు.

ఈ దేశాన్ని ప్రేమించే వారెవ్వరూ జాతీయ జెండాను ఇంటి దగ్గర ఆవిష్కరించడానికి సందేహించడని అన్నారు. స్వాతంత్ర్య సమర యోధులు జాతీయ జెండాను పట్టుకుని ఉరి ఖంబాలు ఎక్కారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ పిలుపుకు అనుగుణంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకం ఎగరాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకను పురస్కరించుకుని ఇంటిలో జెండా ఆవిష్కరించడానికి ఎవరికైనా ఎందుకు సంకోచం ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. 

పేద ప్రజలు జాతీయ జెండా కొనుగోలు చేసే సామర్థ్యం లేని కారణంగా చాలా ఇళ్లల్లో జెండా ఆవిష్కరణ సాధ్యం కాదని కాంగ్రెస్ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios