రూ.పది కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడిని చంపేశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నిన్న సాయంత్రం ప్రేమ్‌పాల్ గంగ్వార్ (42) అనే వ్యక్తి హెయిర్ కటింగ్ కోసం తన మిత్రుడు అహిబరన్ లాల్ సెలూన్‌కి వెళ్లాడు. పది రూపాయల కోసం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. వీరిద్దరూ 20 ఏళ్లుగా మంచి స్నేహితులు కావడంతో... సరదాగా కొట్టుకుంటున్నారని స్థానికులు భావించారు.
 
అయితే కొద్ది సేపటి తర్వాత ప్రేమ్‌పాల్ అహిబరన్‌పై చెంపమీద కొట్టాడు. దీంతో అహిబరన్ కత్తెర తీసుకుని ప్రేమ్‌పాల్‌ను పొడిచేశాడు.  ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రేమ్ పాల్ కుమారులపై కూడా  దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

 ఈ దృశ్యం చూసి షాక్ తిన్న స్థానికులు హుటాహుటిన ప్రేమ్‌పాల్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో అతడు మృతిచెందాడు. అహీబిరన్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశామనీ... అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని భూటా స్టేషన్ ఆఫీసర్ సురేంద్ర కుమార్ సింగ్ వెల్లడించారు.