ఆస్తి కోసం అన్నను హతమొందించి.. కన్న తల్లి, సోదరితో కలిసి హైడ్రామా..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన అన్నను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కన్న తల్లి, సోదరితో కలిసి ఫ్యాన్‌కు ఉరి వేశారు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
"మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు. మచ్చుకైనా లేడు.. చూడు మానవత్వం ఉన్నవాడు" అంటూ ఓ గేయ రచయిత రాసిన పాట నేటీ సమాజానికి సరిగ్గా సరిపోతోంది. ఈ రోజుల్లో ఎవ్వడి స్వార్థం కోసం వాడు ప్రయత్నిస్తున్నాడు. అడ్డు వస్తే.. సొంత వారినైనా హతమొందించడానికి వెనుక ఆడటం లేదు. తాజాగా ఓ యువకుడు ఆస్తి కోసం సొంత అన్నను అత్యంత దారుణంగా కడతేర్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ దారుణానికి కన్న తల్లి, సోదరి కూడా సహకరించడం మరీ దారుణం.
వివరాల్లోకెళ్లే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఆదివారం 26 ఏళ్ల యువకుడిని అతని తమ్ముడు హత్య చేశాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు కన్న తల్లి, సోదరి సహకరించారు. మృతుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయినట్టు చిత్రీకరించారు. మీరట్ జిల్లాలోని లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అషియానా కాలనీ స్ట్రీట్ నంబర్-18లో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనపై మీరట్ సీనియర్ ఎస్సై రోహిత్ సింగ్ సజ్వాన్ మాట్లాడుతూ.. తమకు అక్టోబర్ 8న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందిందని చెప్పారు.ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో 26 ఏళ్ల షాజాద్ మృతదేహం ఇంటి లోపల ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అతని గొంతుపై పదునైన ఆయుధంతో కోసి ఉంది. దీంతో పోలీసులు అనుమానస్పద ఘటనగా గుర్తించారు. నిందితులు అడ్డుకున్న శవాన్ని పోస్టు మార్టానికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో షాజాద్ గొంతు కోసి హత్య చేశారని తేలింది. ఆపై ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరినట్టు పోలీసుల విచారణలో తేలింది.
నిందితుడు అక్రమ్‌కు తరణ్ణం అనే అమ్మాయితో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్‌ఎస్పీ తెలిపారు. కానీ వారి పెళ్లిని మృతుడు షాజాద్ అంగీకరించలేదు. వారిని ఇంట్లో రాకుండా నిరసన తెలిపాడు. దీంతో షాజాద్, అక్రమ్ మధ్య ఆస్తి వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ వివాదం కారణంగా షాజాద్‌ను అతని తమ్ముడు అక్రమ్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల తమదైన శైలిలో విచారించగా.. నిందితుడు హత్యా నేరాన్ని అంగీకరించాడు.
ఆస్తిలో తనకు వాటా ఇవ్వడానికి అన్నయ్య షెహజాద్ నిరాకరించాడని నిందితుడు అక్రమ్ పోలీసుల విచారణలో తెలిపాడు. అతను పదేపదే వివరణ ఇచ్చిన తర్వాత కూడా తన అన్న షాజాద్ అంగీకరించలేదనీ, దీంతో అతడ్ని హత్య చేశానని తెలిపారు. పోలీసులకు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తల్లి షబానా, సోదరి గుల్షన్ సాయంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యగా చిత్రీకరించనట్టు తెలిపారు. లోహియా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎఎస్పీ తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.