దీపావళి పండుగ సందర్భంగా కల్తీ ఆహార పదార్థాల అమ్మకాలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. 2993 క్వింటాళ్ల కల్తీ సరుకును స్వాధీనం చేసుకుంది. 1155 క్వింటాళ్ల పాడైన సరుకును ధ్వంసం చేసింది.

Uttar Pradesh : ఈ దీపావళి పండుగను ప్రజలు సురక్షితంగా, ఆరోగ్యకరంగా జరుపుకునేందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠిన వైఖరి అవలంబించారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం అక్టోబర్ 8 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.. ఇది ఈనెల 17 వరకు కొనసాగనుంది. దీపావళి పండగవేళ ఆహార భద్రత, ఔషధ పరిపాలన బృందాలు 4621 తనిఖీలు, 2085 దాడులు, 2853 నమూనాల పరీక్షలు చేశాయి. ఇప్పటివరకు మొత్తం 2993 క్వింటాళ్ల కల్తీ, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీని అంచనా విలువ రూ.3.88 కోట్లు. 1155 క్వింటాళ్ల సరుకును ధ్వంసం చేశారు, దీని అంచనా విలువ రూ.1.75 కోట్లు. ఉన్నావ్, మధుర, లక్నోలలో భారతీయ న్యాయ సంహిత 2023 కింద మూడు ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేశారు.

సామాన్య ప్రజల ఆరోగ్యంతో రాజీ లేదు

పండుగలను సురక్షితంగా, పరిశుభ్రంగా, ఆనందదాయకంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆహార భద్రత, ఔషధ పరిపాలన కార్యదర్శి డాక్టర్ రోషన్ జాకబ్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కల్తీకి, ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాలకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. పండుగల సందర్భంగా సామాన్య ప్రజల ఆరోగ్యంతో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం ఆయన చేశారు. త్వరగా పాడైపోయే పదార్థాలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని ధ్వంసం చేస్తున్నామని… తద్వారా వినియోగదారుల భద్రతను నిర్ధారిస్తున్నామన్నారు. 

వివిధ జిల్లాల్లో జరుగుతున్న చర్యలు

ఈ డ్రైవ్‌లో భాగంగా ఉన్నావ్‌లో 215 కిలోల కోవాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు… నమూనాలు సేకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మధురలో 400 కిలోల కల్తీ పనీర్‌ను ధ్వంసం చేశారు. లక్నోలో 802 కిలోల కోవాను ధ్వంసం చేశారు. ఝాన్సీలో 1200 కిలోల కోవా, హత్రాస్‌లో 790 కిలోల కల్తీ ఊరగాయను స్వాధీనం చేసుకుని 3000 కిలోల పాడైన ఊరగాయను ధ్వంసం చేశారు. బులంద్‌షహర్‌లో 3000 కిలోల కల్తీ రసగుల్లా, గులాబ్‌జామున్, మీర్జాపూర్‌లో 1478 కిలోల కల్తీ కోవా, సహారన్‌పూర్‌లో 1100 కిలోల కోవాను ధ్వంసం చేశారు. అదేవిధంగా, హాపుర్‌లో 6000 లీటర్ల రిఫైన్డ్ సోయాబీన్ నూనెను స్వాధీనం చేసుకున్నారు.

పాలు, కోవా, పనీర్, మిఠాయిలు స్వాధీనం

కాన్పూర్ దేహత్‌లో 500 లీటర్ల పాలు, 400 కిలోల కోవా, 2200 కిలోల బర్ఫీ, 250 కిలోల పేడా, 358 కిలోల స్వీట్ కేక్‌ను ధ్వంసం చేశారు. గోరఖ్‌పూర్‌లో 1400 కిలోల పనీర్, కోవాను స్వాధీనం చేసుకుని 1000 లీటర్ల పాడైన ఆవాల నూనెను ధ్వంసం చేశారు. మీరట్‌లో 71 లీటర్ల పామాలిన్ నూనె, 20 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను స్వాధీనం చేసుకుని 35 కిలోల రసగుల్లా, 180 కిలోల పనీర్, 2500 కిలోల కోవాను ధ్వంసం చేశారు. ఏటాలో 340 లీటర్ల ఆవాల నూనె, 900 కిలోల నెయ్యిని ధ్వంసం చేశారు. ఖీరీలో 871 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని 50 కిలోలను ధ్వంసం చేశారు. ఆగ్రా, అలీగఢ్, ఘజియాబాద్, ముజఫర్‌నగర్‌లలో కూడా లక్షల విలువైన కల్తీ పదార్థాలను ధ్వంసం చేశారు.

టోల్ ప్లాజాలు, హైవేలపై కూడా డ్రైవ్

టోల్ ప్లాజాలు, హైవేలపై కూడా డ్రైవ్‌లో భాగంగా పెద్ద మొత్తంలో సరుకును స్వాధీనం చేసుకున్నారు. సాహిబాబాద్ టోల్ వద్ద 750 కిలోల పనీర్, హాపుర్ టోల్ ఛిజార్సీ వద్ద 1500 కిలోల పనీర్, ఎన్‌హెచ్ 34, జీటీ రోడ్ కాన్పూర్ నుండి 4040 కిలోల కోవా, బారాబంకి టోల్ నుండి 910 కార్టన్ల కల్తీ మిఠాయి, కాన్పూర్ పంకీ రోడ్ నుండి 2450 కిలోల కోవాను ధ్వంసం చేశారు.

 ఈ నెంబర్లకు కాల్ చేయండి

ఎక్కడైనా ఆహార పదార్థాలలో కల్తీ, నకిలీ ఉత్పత్తుల తయారీ లేదా అమ్మకం, లేదా వ్యవస్థీకృతంగా కల్తీ వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగానికి సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీని కోసం, విభాగం ప్రత్యేక హెల్ప్‌లైన్, వాట్సాప్ నంబర్లను జారీ చేసింది. రహస్య ఫిర్యాదు నమోదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800-180-5533కు కాల్ చేయవచ్చు. కల్తీ లేదా నకిలీ ఆహార పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ నంబర్ 9793429747కు పంపవచ్చు. ఎవరికైనా నకిలీ లేదా నాసిరకం మందుల తయారీ లేదా అమ్మకం గురించి తెలిస్తే, ఆ సమాచారాన్ని వాట్సాప్ నంబర్ 8756128434కు పంపవచ్చు. ఇలాంటి ఫిర్యాదుదారుల గుర్తింపును గోప్యంగా ఉంచుతామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.